Site icon HashtagU Telugu

KKR vs RCB : ఫిల్ సాల్ట్ తో కేకేఆర్ జాగ్రత్త..

KKR beware of Phil Salt

KKR beware of Phil Salt

KKR vs RCB: ఐపీఎల్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఈ ధనాధన్ లీగ్ తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. ఇరు జట్లు విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నాయి. సొంత మైదానం కారణంగా కేకేఆర్ బలంగా కనిపిస్తుంది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ దళంతో కేకేఆర్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫిల్ సాల్ట్ విరాట్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. టి20లో సాల్ట్ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్. అంతర్జాతీయ టీ20ల్లో 3 సెంచరీలు చేసిన సాల్ట్, గత 2 ఐపీఎల్ సీజన్లలో బౌలర్లకు తలనొప్పిగా మారాడు. సాల్ట్ పవర్ ప్లేని పర్ఫెక్ట్ గా ఆడితే, సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి.

Read Also: KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే : కేసీఆర్‌

ఫిల్ సాల్ట్ కేకేఆర్ బౌలర్లను ఇబ్బంది పెట్టగలడని సీనియర్లు సూచిస్తున్నారు. దీనికి అతి ముఖ్యమైన కారణం అతను గత సీజన్‌లో కేకేఆర్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టును ఛాంపియన్‌గా మార్చడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. అయితే ప్లేఆఫ్స్ మరియు ఫైనల్స్ కు అందుబాటులో లేకపోయినా కేకేఆర్ ను ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లడంలో తనదే కీలక పాత్ర. ఫిల్ సాల్ట్ ఇదే ఆర్సీబీని వీర కుమ్ముడు కుమ్మాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో కేవలం 14 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. విశేషమేంటంటే ఇదే ఈడెన్ గార్డెన్స్ లో సాల్ట్ ఆర్సీబీని ఉతికారేశాడు. సాల్ట్ ఐపీఎల్‌లో కేవలం 2 సీజన్లు మాత్రమే ఆడాడు. 2023లో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమయ్యాడు. 9 మ్యాచ్‌ల్లో 163 ​​కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 218 పరుగులు చేశాడు. 2024లో కేకేఆర్ తరపున 12 మ్యాచ్‌ల్లో 182 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు చేశాడు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 7 గంటలకే టాస్ వేయనున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఆర్సీబీ 14 మ్యాచ్‌లలో గెలిచింది. కేకేఆర్ 20 సార్లు గెలిచింది. గతేడాది ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా కేకేఆర్ రెండు సార్లు గెలిచింది. చివరి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇకపోతే మెగాటోర్నీలో మూడో టైటిళ్లు సాధించిన కోల్ క‌తా సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగే తొలి మ్యాచ్ లో శుభారంభం చేయాల‌ని భావిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ కోసం ఆరంభం అదిరిపోయేవిధంగా ప్రదర్శన ఇవ్వాలనుకుంటుంది. అయితే ఇరు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. టీమ్‌లో దూకుడైన బ్యాటర్లతో పాటు స్పిన్నర్ సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీలు ఉన్నారు. ఆర్‌సీబీ కూడా పటిష్టంగానే ఉంది. విరాట్ కోహ్లీతో పాటు ఫిట్ సాల్ట్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్‌, కృనాల్ పాండ్యాలతో జట్టు భీకరంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్‌తో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. దాంతో తొలిపోరే అభిమానులను అలరించనుంది.

Read Also: PVR Inox : బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో బిగ్ డీల్