KKR vs PBKS: ఈడెన్ లో అదరగొట్టిన కోల్ కత్తా… పంజాబ్ కింగ్స్ పై విజయం

KKR vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ మరోసారి తన హోం గ్రౌండ్ లో అదరగొట్టింది.

  • Written By:
  • Updated On - May 8, 2023 / 11:33 PM IST

KKR vs PBKS: ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ మరోసారి తన హోం గ్రౌండ్ లో అదరగొట్టింది. కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేక పోయారు. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఔట్ అవగా…వెంటనే రాజపక్స డక్‌ అవుట్ అయ్యాడు. హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయడంతో పంజాబ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 58 పరుగులు చేసింది.

కీలక వికెట్లు చేజారినా…కెప్టెన్ శిఖర్ ధావన్ ఆదుకున్నాడు. జితేశ్ శర్మతో కలిసి ధావన్ జట్టును ముందుకు నడిపించాడు. ధావన్ హాఫ్ సెంచరీ సాధించగా..జితేశ్ శర్మ 21 రన్స్ కు వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే శిఖర్ ధావన్ కూడా ఔటవడంతో పంజాబ్ తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేలా కనిపించింది.

ఈ దశలో ధాటిగా ఆడిన రిషి ధావన్ 19 , షారూఖ్ ఖాన్ 21 రన్స్ తో పోరాడే లక్ష్యాన్ని అందించారు.చివరికి పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. ధావన్ 47 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57 రన్స్ చేశాడు.కోల్ కత్తా బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా రెండు, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.

180 పరుగుల లక్ష్య చేధనలో కోల్ కత్తాకు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. జాసన్ రాయ్, గుర్బాజ్ తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. గుర్బాజ్ 15 రన్స్ చేయగా…ధాటిగా ఆడిన రాయ్ 24 బాల్స్ లో 38 రన్స్ చేశాడు. తర్వాత కెప్టెన్ నితీశ్ రాణా, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్ కు 54 పరుగులు జోడించారు. గాయంతో ఇబ్బంది పడిన వెంకటేష్ అయ్యర్ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు.

https://twitter.com/IPL/status/1655622951407075334/video/1

అయితే నితీశ్ రాణా ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కీలక సమయంలో ఔట్ అయ్యాక…రస్సెల్ , రింకూ సింగ్ ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈ సీజన్ లో స్థాయికి తగినట్టు ఆడలేకపోయిన రస్సెల్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. శామ్ కరన్ వేసిన ఓవర్లో మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. చివరి ఓవర్లో రస్సెల్ ఔట్ అయినా…రింకూ సింగ్ జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. చివరి బంతికి రెండు రన్స్ చేయాల్సి ఉండగా…ఫోర్ కొట్టి గెలిపించాడు. ఈ సీజన్ లో కోల్ కత్తాకు ఇది అయిదో విజయం.

Also Read: IPL: రసవత్తరంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్‌