బోణీ కొట్టిన హైద‌రాబాద్‌.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Published By: HashtagU Telugu Desk
KKR vs SRH

KKR vs SRH

KKR vs SRH: ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలుత అద్భుతమైన బ్యాటింగ్‌తో, ఆ తర్వాత పటిష్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. సన్‌రైజర్స్ తరపున అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. కోల్‌కతాపై 65 పరుగుల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అనంతరం నాలుగో స్థానంలో వచ్చిన హెన్రిక్ క్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరాకు 2 వికెట్లు దక్కాయి.

Also Read: రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

కోల్‌కతాకు తప్పని ఓటమి

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ మినహా ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేకేఆర్ 161 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 7 బంతుల్లో 28 పరుగులు చేయగా, కెప్టెన్ అజింక్య రహానే 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అంగ్క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి రన్ అవుట్ అయ్యాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్ 25 బంతుల్లో 35 పరుగులు చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. స‌న్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. ఇషాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.

  Last Updated: 03 Apr 2026, 06:45 AM IST