ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్ మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు గుప్పించిన ఐర్లాండ్ ప్లేయర్ జోషువా లిటిల్ (Joshua Little) కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడ్డాయి. గతేడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్న జోషువా (Joshua Little).. తక్కువ టైమ్‌లో షార్ట్ ఫార్మాట్‌లో రాణించాడు. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ తన ప్రదర్శనతో ఫ్రాంఛైజీ ఓనర్లన దృష్టిలో పడ్డాడు. ఊహించినట్టుగానే ఈ మినీ వేలంలో అతడు భారీ మొత్తానికి అమ్ముడుపోయాడు.
గుజరాత్ టైటాన్స్ రూ.4.4 కోట్లకు జోషువాను దక్కించుకుంది. ఈ ఐర్లాండ్ ప్లేయర్ కోసం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గట్టిపోటీనే నడిచింది. ఎవ్వరూ తగ్గకపోవడంతో అతడి ధర భారీగా పెరిగింది. లెఫార్మ్ పేసర్ కోసం చివరి వరకు పోటీ పడిన గుజరాత్ 4.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న మొదటి ఐర్లాండ్ ప్లేయర్‌గా జోషువా రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల జోషువా.. అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్‌లో 39 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్ 2022లోనూ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి రికార్డు సృష్టించాడు.
Also Read: All Out For 6 Runs: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఆరు పరుగులకే ఆలౌట్
ఇదిలా ఉంటే వేలానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంపై జోషువా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత సీజన్‌లో నెట్ బౌలర్‌గా ఎంపికైన తనను చెన్నై సరిగా ట్రీట్ చేయలేదని జోషువా వ్యాఖ్యానించాడు. తానొక అంతర్జాతీయ క్రికెటర్ అయినప్పటకీ కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నాడు. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తనకు తుది జట్టులో అవకాశం కల్పిస్తామని చెప్పిందని, అలా చేయకపోగా, కనీసం నెట్ బౌలర్‌గా కూడా వినియోగించుకోలేదని బాధపడ్డాడు.
చివరికి ట్రైనింగ్ సెషన్స్‌లో కూడా పూర్తిగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని వాపోయాడు. అప్పటికే లంక ప్రీమియర్ లీగ్, టీ10 లీగ్‌లో ఆడి, జాతీయ జట్టు తరఫున సత్తా చాటిన తన పట్ల చెన్నై యాజమాన్యం ప్రవర్తించిన తీరు చాలా బాధించిందన్నాడు. ఈ కారణంగానే సీజన్ మధ్యలో స్వదేశానికి వెళ్ళిపోయిన విషయాన్ని వెల్లడించాడు. జోషువా ఈ కామెంట్స్ చేసినా వేలంలో మాత్రం ఫ్రాంచైజీలు అతని కోసం ఆసక్తి కనబరిచాయి.