Jammu Kashmir Cricketer: ఆసియా కప్ 2025 కోసం క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో క్రికెట్ ప్రపంచానికి ఒక విషాదకరమైన వార్త అందింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యువ, ప్రతిభావంతుడైన క్రికెటర్ (Jammu Kashmir Cricketer) ఫరీద్ హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన రాష్ట్ర క్రికెట్ సంఘంతో పాటు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదం జరిగిన తీరు
ఈ విషాదకర ఘటన ఆగస్టు 20న జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం.. ఫరీద్ హుస్సేన్ తన స్కూటర్‌పై వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కారు డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. దీనిని ఊహించని ఫరీద్, ఆ డోర్‌ను బలంగా ఢీకొని రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్పృహ కోల్పోయారు.
స్థానికులు గమనించి వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ తలకు తీవ్రంగా తగలడం వల్ల యుక క్రికెటర్ కోలుకోలేకపోయారు. చివరకు శనివారం (ఆగస్టు 23న) ఫరీద్ హుస్సేన్ తుది శ్వాస విడిచారు.
Also Read: Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్
ఈ ప్రమాద ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఫుటేజీలో కారు డోర్ ఎలా అకస్మాత్తుగా తెరుచుకుంది. ఫరీద్ ఎలా ఢీకొని కిందపడ్డారనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. ఇది చూసిన క్రీడాభిమానులు, ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రాష్ట్రానికి తీరని లోటు
ఫరీద్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభ, క్రీడపై ఆయనకున్న అంకితభావం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన అకాల మరణం జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌కు తీరని లోటు. రాష్ట్ర క్రికెట్ సంఘం, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు ఫరీద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.