Ishan Kishan: విజయ్ హజారే ట్రోఫీలో బుధవారం రికార్డుల పరంపర కొనసాగింది. తొలుత 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది కొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వైభవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
అత్యంత వేగవంతమైన సెంచరీ ఎవరిది?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇద్దరి కంటే వేగంగా బీహార్ కెప్టెన్ సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. దీనితో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా సకిబుల్ గని రికార్డు సృష్టించాడు.
ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కేవలం 39 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. 300 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఇషాన్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు 2026 టీ20 వరల్డ్ కప్ కోసం అతడిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.
Also Read: భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!
బీహార్ భారీ స్కోరు
మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ బ్యాటర్లు ఊచకోత కోశారు. వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు (16 ఫోర్లు, 15 సిక్సర్లు) చేశాడు. సకిబుల్ గని 40 బంతుల్లో 128 పరుగులు నాటౌట్ (10 ఫోర్లు, 12 సిక్సర్లు) చేశాడు. ఆయుష్ లోహారుక 56 బంతుల్లో 116 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి సెంచరీల ధాటికి బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇటీవలే జార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన ఇషాన్ కిషన్, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
