Site icon HashtagU Telugu

ISSF Junior World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్.. భారత్‌కు 23 పతకాలు!

ISSF Junior World Cup

ISSF Junior World Cup

ISSF Junior World Cup: న్యూఢిల్లీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో (ISSF Junior World Cup) మంగళవారం నాడు భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం పతకాల సంఖ్యను 23కు పెంచుకుని, భారత్ నెం. 1 స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా ఇషా అనిల్ తక్సాలే- హిమాన్షు జోడి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తమ దేశస్థులైన శంభావి క్షీరసాగర్, నరేన్ ప్రణవ్ జోడిపై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి స్వర్ణాన్ని గెలుచుకుంది. పురుషుల ట్రాప్‌లో (Men’s Trap) వినయ్ ప్రతాప్ చంద్రావత్ కాంస్య పతకాన్ని సాధించాడు.

ఉత్కంఠ పోరులో ఇషా-హిమాన్షు విజయం

ఈవెంట్ చివరి రోజుకు ముందు భారత్ ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 23 పతకాలకు చేరుకుంది. ఇషా- హిమాన్షు జంట 17-15 తేడాతో శంభావి, ప్రణవ్‌లను ఓడించింది. ఒకానొక దశలో 9-15తో వెనుకబడినప్పటికీ వారు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ స్వర్ణ పతక మ్యాచ్‌లో రెండు జంటలు కూడా అత్యుత్తమ షూటింగ్‌ను ప్రదర్శించాయి. శంభావి రెండు పరిపూర్ణ 10.9 స్కోర్‌లు నమోదు చేయగా, ఇషా ఒక 10.9 స్కోర్‌ను సాధించింది. మొత్తం 64 షాట్లలో కేవలం ఐదు మాత్రమే 10 కంటే తక్కువగా నమోదయ్యాయి. కాంస్య పతకాన్ని ఇండివిడ్యువల్ న్యూట్రల్ అథ్లెట్స్ (AIN)కు చెందిన వర్వారా కర్దకోవా, కమిల్ నూరియాఖ్‌మెటోవ్ గెలుచుకున్నారు.

Also Read: Arunachalam : అరుణాచలంలో తెలుగు యాత్రికురాలిను అత్యాచారం చేసిన కానిస్టేబుళ్లు

చంద్రావత్‌కు కాంస్యం

పురుషుల ట్రాప్ జూనియర్ ఫైనల్‌లో క్రొయేషియాకు చెందిన 20 ఏళ్ల టోనీ గుడెల్జ్ ఆకట్టుకునే ప్రదర్శన చేసి 44 టార్గెట్‌లను ఛేదించి తన దేశానికి మొదటి స్వర్ణ పతకాన్ని అందించాడు. క్వాలిఫికేషన్‌లో 120+6తో అగ్రస్థానంలో నిలిచిన స్పెయిన్‌కు చెందిన ఐజాక్ హెర్నాండెజ్ రజతాన్ని (41) సొంతం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన చంద్రావత్ 34 స్కోర్‌తో కాంస్యాన్ని కైవసం చేసుకోగా, అతని సహచరుడు అర్జున్ 29 స్కోర్‌తో నాల్గవ స్థానంలో నిలిచాడు.

మహిళల ట్రాప్ జూనియర్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన లీయా కుసెరోవా 41 హిట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇటలీకి చెందిన సోఫియా గోరీ (37) రజతం గెలుచుకోగా, ఏఐఎన్‌కు చెందిన క్సేనియా సమోఫలోవా (30) కాంస్యం సాధించింది. క్వాలిఫికేషన్ షూట్-ఆఫ్‌లో భారత క్రీడాకారిణి సబీరా హారిస్ 112 హిట్లతో సమంగా నిలిచినా, ఫైనల్ బెర్తులు లూసీ మైయర్స్ (యూఎస్‌ఏ), కుసెరోవాకు దక్కడంతో సబీరా ఏడవ స్థానంలో నిలిచింది.

పిస్టల్ ఈవెంట్లలో భారత ఆధిపత్యం

మహిళల 25 మీటర్ల పిస్టల్ ప్రెసిషన్ స్టేజ్‌లో భారత్‌కు చెందిన తేజస్విని 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇటలీకి చెందిన అలెశాండ్రా ఫైట్ (287) రెండో స్థానంలో ఏఐఎన్‌కు చెందిన విక్టోరియా ఖోలోద్నైయా (286) మూడో స్థానంలో ఉన్నారు. భారత్‌కు చెందిన నామ్యా కపూర్ (284) నాలుగో స్థానంలో, రియా శిరీష్ థాట్టే (281) ఆరో స్థానంలో ఉన్నారు. బుధవారం రాపిడ్ ఫైర్ దశ జరగనుంది. ఆ తర్వాత తొలి ఆరుగురు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

ఒలింపిక్ యేతర ఈవెంట్‌గా పరిగణించే పురుషుల 25 మీటర్ల పిస్టల్ ప్రెసిషన్ స్టేజ్‌లో భారత్‌కు చెందిన రాఘవ్ వర్మ 290 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. అతని సహచరుడు ముఖేష్ నెల్లవల్లి (289) స్వల్ప తేడాతో వెనుకబడి ఉన్నాడు. బుధవారం రాపిడ్-ఫైర్ దశ పూర్తయిన తర్వాత, సంచిత స్కోర్‌ల ఆధారంగా పతక విజేతలను నిర్ణయిస్తారు.

Exit mobile version