Rahul Dravid: సొంత గూటికి రాహుల్ ద్ర‌విడ్‌.. కోచ్ పాత్ర‌లోనే రీఎంట్రీ..?

టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ గెలవడంతో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. ఐపిఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)కి మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ప్ర‌స్తుతం ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

  • Written By:
  • Updated On - July 23, 2024 / 12:04 PM IST

Rahul Dravid: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ గెలవడంతో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. ఐపిఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)కి మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ప్ర‌స్తుతం ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గంభీర్ నిష్క్రమణ తర్వాత కేకేఆర్‌లో ద్రవిడ్‌కు పెద్ద బాధ్యత వస్తుందని ఇటీవల చర్చ జరిగింది. అయితే ద్ర‌విడ్‌కి సంబంధించిన ఓ ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. దీనిలో ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ (RR)లో చేరవచ్చని స‌మాచారం. నివేదిక ప్ర‌కారం.. IPL 2025లో ఆర్ఆర్ ప్రధాన కోచ్‌గా ద్ర‌విడ్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఓ ప్ర‌ముఖ‌ నివేదిక ప్రకారం.. 51 ఏళ్ల ద్రవిడ్ RRకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. “ఆర్ఆర్, ద్రవిడ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన వెలువడుతుంది” అని విశ్వసనీయ వర్గాలు తెలిపిన‌ట్లు నివేదిక‌లో పేర్కొంది. ద్రవిడ్‌కు ఆర్‌ఆర్‌తో సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. ద్ర‌విడ్ గ‌తంలో RRకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఫ్రాంచైజీ 2013లో ఛాంపియన్స్ లీగ్ T20 ఫైనల్, IPL ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ద్ర‌విడ్ 2014, 2015లో మెంటార్ పాత్రను కూడా పోషించాడు. ఆ స‌మ‌యంలో జట్టు మూడవ స్థానంలో నిలిచింది.

Also Read: IND vs PAK: భార‌త్‌- పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్.. పాక్ స్టాండ్ ఇదే..!

అయితే ద్ర‌విడ్ RRలో చేరితే ఫ్రాంచైజీ కుమార సంగక్కరను ఉంచుకుంటుందా అనేది అస్పష్టంగా ఉంది. సంగక్కర 2021 నుంచి రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ ద్రవిడ్ 2015 నుండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ)తో సంబంధం కలిగి ఉన్నాడు. భారత అండర్-19, ఇండియా ‘ఎ’ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఛైర్మన్‌గా మారారు. అక్టోబర్ 2021 నుండి సీనియర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

We’re now on WhatsApp. Click to Join.

తాను మళ్లీ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయనని టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ద్రవిడ్ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. కుటుంబానికి స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోవ‌డంతోనే కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేయ‌న‌ని కూడా కార‌ణం చెప్పాడు. అయితే ఐపీఎల్‌లో ద్రవిడ్ ఏడాదికి 2-3 నెలలు మాత్రమే ఫ్రాంచైజీతో ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో అతను తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వగలడు. ద్ర‌విడ్ 2008 నుండి 2013 వరకు IPLలో 89 మ్యాచ్‌లు ఆడాడు. 11 అర్ధ సెంచరీల సహాయంతో 2174 పరుగులు చేశాడు.

 

Follow us