IPLMatch: పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను (IPLMatch) రద్దు చేసినట్లు ప్రకటించారు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్‌లలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మ్యాచ్ రద్దు అయింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యంగా జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో కేవలం 61 బంతుల ఆట మాత్రమే జరిగింది. ఈ సమయంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు విధ్వంసకర శైలిలో అర్ధసెంచరీలు సాధించారు.
పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 10.1 ఓవర్లలో 122 పరుగులు సాధించింది. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తమ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు. 9వ ఓవర్‌లోనే పంజాబ్ 100 పరుగుల మైలురాయిని దాటింది. ఒకవైపు ప్రియాంశ్ ఆర్య కేవలం 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయగా, మరోవైపు ప్రభ్‌సిమ్రన్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.
61 బంతుల ఆటలో పంజాబ్ కింగ్స్ స్కోరు 122/1కి చేరుకుంది. ప్రియాంశ్ 34 బంతుల్లో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చి బ్యాటింగ్‌కు సిద్ధమవుతుండగా, ధర్మశాల మైదానంలో పూర్తి బ్లాక్‌ఔట్ సంభవించింది. శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ డగౌట్ వైపు వెనక్కి వెళ్తుండగా మొదట వర్షం వచ్చినట్లు అనిపించింది. కానీ మ్యాచ్ ఆగిపోవడానికి కారణం వర్షం కాదు.. సాంకేతిక లోపం. మైదానంలో సాంకేతిక లోపం కారణంగా ఫ్లడ్‌లైట్‌లు ఆగిపోవడంతో మైదానం మొత్తం చీకటిలో మునిగిపోయిందని తెలిపారు.
మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలు సులభతరం అయ్యాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్-4లో స్థానం సంపాదించడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ నుండి విఫలమైన దాడుల ప్రయత్నాల మధ్య ధర్మశాల మైదానంలో బ్లాక్‌ఔట్ నీడ కమ్మింది. మొదట ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని ఊహాగానాలు ఉన్నప్పటికీ.. ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్‌ను ధర్మశాలలోనే నిర్వహించారు.