Team India: ఐపీఎల్ ఎఫెక్ట్.. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫిని కొట్టలేని టీమిండియా!

ఐపీఎల్ కోసం తమ సర్వశక్తులూ ధారపోస్తున్న స్టార్ ప్లేయర్లు..భారతజట్టు కోసం మాత్రం మొక్కుబడిగానే ఆడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
WTC Final

WTC Final

ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ ఫైనల్లో వరుసగా రెండోసారి భారత్ కు వైఫల్యమే ఎదురయ్యింది. జేబులు నింపే ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యం… గొప్పగౌరవాన్ని, ట్రోఫీలను సంపాదించిపెట్టే ఐసీసీ ప్రపంచ టోర్నీలకు భారత క్రికెట్ బోర్డు ఏమాత్రం ఇవ్వడం లేదన్న విమర్శలు రానురాను పెరిగిపోతున్నాయి. ప్రపంచ క్రికెట్ కు చిరునామాగా నిలిచిన భారత్ పరిస్థితి పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్లుగా తయారయ్యింది. ఐసీసీకి వివిధ రూపాలలో లభించే వేలకోట్ల రూపాయల ఆదాయంలో 80 శాతం భారత్ నుంచే సమకూరుతోంది. అయితే..ఐసీసీ నిర్వహించే ప్రపంచ ( వన్డే, టీ-20, టెస్టు లీగ్, మినీ ప్రపంచకప్)టోర్నీలలో మాత్రం..

2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ మరో ఐసీసీ ప్రపంచ టోర్నీ నెగ్గలేదంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. 1983 వన్డే ప్రపంచకప్ లో కపిల్ దేవ్, 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలలో మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్ కు ట్రోఫీలు అందించారు. ఆ తర్వాత జరిగిన వన్డే, టీ-20, టెస్టులీగ్ టోర్నీలలో భారత్ విపలమవుతూనే వస్తోంది. దేశంలోని ప్రయివేటు పార్టీ( ఫ్రాంచైజీల)ల వ్యాపారంగా సాగుతున్న ఐపీఎల్ కోసం భారత క్రికెట్ బోర్డు, క్రికెటర్లు దేశఖ్యాతిని పణంగా పెడుతూ వస్తున్నారు.

కోట్ల రూపాయల వర్షం కురిపించే ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యం..లక్షల రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా అందించే ఐసీసీ మ్యాచ్ లు, ట్రోఫీలకు ఏమాత్రం ఇవ్వడం లేదు. ఐపీఎల్ కోసం తమ సర్వశక్తులూ ధారపోస్తున్న స్టార్ ప్లేయర్లు..భారతజట్టు కోసం మాత్రం మొక్కుబడిగానే ఆడుతున్నారు. యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరంకావడం కూడా మరో కారణం.

Also Read: Target China : చైనా నగరాలన్నీ టార్గెట్ గా భారత్ మిస్సైల్స్

  Last Updated: 13 Jun 2023, 11:12 AM IST