IPL 2025 Retention Rules:ఫ్రాంచైజీలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ (Retention Rules) వచ్చేశాయి. ఊహించినట్టుగానే బీసీసీఐ ఈ సారి ఫ్రాంచైజీల్లో జోష్ నింపేలా నిర్ణయాలు తీసుకుంది. నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశమిస్తారని భావిస్తే… ఐదుగురు ప్లేయర్స్ రిటెన్షన్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైట్ టూ మ్యాచ్ కార్డ్(RTM) ద్వారా ఒకరిని జట్టులోకి తీసుకునే రూల్ నూ తీసుకొచ్చింది. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం చూస్తే మెగావేలానికి ముందు ప్రతీ ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్స్ ను తమతో పాటు కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ముగ్గురినే రిటైన్ చేసుకుంటే ఆర్టీఎం ఆప్షన్ ద్వారా మరో ముగ్గురిని దక్కించుకోవచ్చు. అయితే ఐదుగురు ప్లేయర్స్ రిటైన్ చేసుకునే క్రమంలో ఫ్రాంచైజీలు 75 కోట్ల వరకూ ఖర్ఛు చేయాల్సి ఉంటుంది.
మొదటి రిటెన్షన్ కు రూ.18 కోట్లు, రెండో రిటెన్షన్ కు రూ.14 కోట్లు, మూడో ప్లేయర్ రిటెన్షన్ కు రూ.11 కోట్ల వరకూ ఖర్ఛు చేయొచ్చు.అలాగే నాలుగో ప్లేయర్ రిటెన్షన్ కోసం రూ. 18 కోట్లు, ఐదో ప్లేయర్ రిటెన్షన్ కోసం రూ.14 కోట్ల వరకూ వెచ్చించేందుకు అనుమతినిచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే ఐదుగురు రిటైన్ ప్లేయర్స్ కు రూ.75 కోట్ల వరకు పరిమితి ఉంటుంది. కాగా ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే జాబితాలో ఖచ్చితంగా ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ (ఇప్పటివరకూ జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్) ఉండాల్సిందే. కాగా ఫ్రాంచైజీల మనీ పర్స్ ను కూడా బీసీసీఐ పెంచింది. వచ్చే మెగా వేలంలో ప్రతీ ఫ్రాంచైజీ 120 కోట్ల వరకూ ఖర్చు చేయొచ్చు. గతంతో పోలిస్తే ఇది 20 కోట్లు అదనం. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను కూడా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొన్ని ఫ్రాంచైజీలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను వ్యతిరేకించినప్పటికీ బ్రాడ్ కాస్టర్లు, ఇతర ఫ్రాంచైజీ ఓనర్ల అభిప్రాయంతో ఏకీభవిస్తూ కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గుచూపింది. కాగా ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటివారంలో జరిగే అవకాశాలున్నాయి. ఈ సారి దుబాయ్ లో వేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: IND vs BAN T20 Squad: నితీశ్ కుమార్ రెడ్డికి సెలక్టర్ల పిలుపు, బంగ్లాతో టీ20లకు భారత జట్టు ఇదే