T20 World Cup: గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో సూపర్-8కు చేరుకున్న టీమ్ ఇండియాకు తొలి మ్యాచ్‌లోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన పోరులో సూర్య సేన ఘోరంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా జట్టు 76 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాకుండా నెట్ రన్ రేట్ (NRR)పై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందా లేదా అన్న భయం అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ ఓటమి తర్వాత ఒక ఆసక్తికరమైన గణాంకం బయటకు వచ్చింది. ఇది అభిమానులకు కాస్త ఊరటనిస్తోంది.
2007లోనూ ఇలాగే జరిగింది!
మొదటి టీ20 ప్రపంచకప్ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ధోనీ సారథ్యంలో అప్పుడు కూడా టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్ (తొలి రౌండ్)లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ తర్వాతి రౌండ్ (సూపర్-8)లో తమ మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుతంగా పుంజుకుని ఏకంగా ప్రపంచకప్ గెలిచింది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా సరిగ్గా అలాగే జరిగింది. గ్రూప్ స్టేజ్ అంతా గెలిచిన భారత్.. తర్వాతి రౌండ్ మొదటి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది.
Also Read: తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
టీమ్ ఇండియా బలంగా పుంజుకోవాలి
2007 నాటి చరిత్రను పునరావృతం చేయాలంటే ఈసారి కూడా టీమ్ ఇండియా అంతే వేగంగా కోలుకోవాలి. ముఖ్యంగా బ్యాటర్లు బాధ్యత తీసుకుని జట్టును ముందుకు నడిపించాలి. సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే భారత్ తన తదుపరి మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, జింబాబ్వే జట్లను భారీ తేడాతో ఓడించాలి. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలని కోరుకోవాలి. ఇకపై టీమ్ ఇండియాకు పొరపాట్లు చేసే అవకాశం లేదు. ప్రపంచకప్ గెలవాలంటే సూర్య అండ్ కో ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌గా భావించి గెలవాల్సిందే.
