టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత.. వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో పోటీకి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్ల రాకతో భారత్ పటిష్టంగా మారింది. అయితే ఇటీవల టీ20 సిరీస్ ఓటమి జట్టును వెంటాడుతోంది.
ఈ మ్యాచ్‌కు ఉన్న అతిపెద్ద ఆకర్షణ భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రీఎంట్రీ. కొంతకాలంగా వన్డేలు లేకపోవడంతో వీరిద్దరూ ఆటకు దూరంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్నారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించనుండగా, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో తమ మార్క్ బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి రాకతో భారత టాప్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారింది.
మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లాండ్ జట్టు కూడా వన్డేల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో భారత బౌలర్లకు ఇది అసలైన పరీక్షగా మారనుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయడం భారత్‌కు ఎంతో కీలకం. జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత పేస్ విభాగం ఇంగ్లాండ్ హిట్టర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమైంది. పిచ్ పరిస్థితులను బట్టి ఇరు జట్లు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ వన్డే పోరు ఇరు జట్లకూ అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఊపులో ఇంగ్లాండ్ ఉండగా, సీనియర్ల రాకతో మరింత బలోపేతమైన భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ విధ్వంసక ఓపెనింగ్, కోహ్లీ క్లాస్ బ్యాటింగ్‌ను వీక్షించేందుకు అభిమానులు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోవడం ఖాయం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
