Site icon HashtagU Telugu

T20I : నాలుగో టీ ట్వంటీ మనదే..సిరీస్ కైవసం

India Vs Australia 4th T20i

India Vs Australia 4th T20i

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ ( T20I ) ను భారత్ (India ) కైవసం చేసుకుంది. మూడో టీ ట్వంటీని తృటిలో చేజార్చుకున్న నాలుగో మ్యాచ్ లో మాత్రం సత్తా చాటి 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రాయ్ పూర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ మరోసారి మెరుపు ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో తొలి వికెట్ కు 50 పరుగులు జోడించారు. జైశ్వాల్ 37, గైక్వాడ్ 32 రన్స్ కు ఔటవగా… తర్వాత శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశారు. ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ భారీ షాట్లతో చెలరేగారు. నాలుగో వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జితేశ్ శర్మ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 35 , రింకూ సింగ్ 29 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ద్వార్షుయిస్ డు వికెట్లు తీయగా.. బెహ్రెండార్ఫ్, సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కూడా ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 40 పరుగులు జోడిండగా.. కీలక సమయంలో భారత స్పిన్నర్లు వికెట్లు తీశారు. ట్రావిడ్ హెడ్ 16 బంతుల్లోనే 31 రన్స్ చేయగా..మెక్ డెర్మోట్ 19 , ఫిలిప్ 8, హార్డీ 8 పరుగులకు వెనుదిరగడంతో ఆసీస్ వరుస వికెట్లు కోల్పోయింది. అయితే టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్ క్రీజులో ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. వీరిద్దరూ అడపా దడపా బౌండరీలు కొడుతూ టెన్షన్ పెట్టారు. ఈ పరిస్థితుల్లో దీపక్ చహర్ వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్ కు పంపాడు…షార్ట్ 22, టిమ్ డేవిడ్ 19 పరుగులకు ఔటయ్యారు. తర్వాత మాథ్యూ వేడ్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లలో భారత బౌలర్లు ఆసీస్ ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. చివరికి ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 , దీపక్ చహర్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను భారత్ గెలుచుకుంది. సిరీస్ లో చివరి మ్యాచ్ బెంగళూరు వేదికగా ఆదివారం జరుగుతుంది.

Read Also : Salaar Trailer : సలార్ ట్రైలర్ టాక్..