India Womens WC Winner: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ (India Womens WC Winner) టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీనితో 2005, 2017లో చేజారిన కలను మహిళా క్రికెటర్లు సాకారం చేశారు.
భారత్ ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (87 పరుగులు), స్మృతి మంధాన (45 పరుగులు) జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత జెమీమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) త్వరగా ఔటైనప్పటికీ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) స్థిరంగా ఆడి జట్టు స్కోరును 298 పరుగులకు చేర్చారు. సఫారీ బౌలర్ ఆయాబోంగా ఖాకా 3 వికెట్లు తీసింది.
Also Read: Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోసమే!
THE MOST AWAITED VIDEO. 😍🇮🇳
– Team India lifting the World Cup Trophy. 🏆
pic.twitter.com/7NE2HapATT— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2025
దక్షిణాఫ్రికా పోరాటం
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు లారా వోల్వార్డ్ (65), తాజ్మిన్ బ్రిట్స్ (23) మంచి ఆరంభం ఇచ్చారు. కానీ అమాన్‌జోత్ కౌర్ అద్భుత ఫీల్డింగ్‌తో బ్రిట్స్ రనౌట్ అవ్వడం మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పింది. ఆ తరువాత షెఫాలీ వర్మ తన స్పిన్ మ్యాజిక్‌తో రెండు కీలక వికెట్లు తీసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుదిపేసింది. మరోవైపు దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో సఫారీలు 246 పరుగులకే ఆలౌటయ్యారు.
ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్‌రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.
