టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

సొంత గడ్డపై, లక్షలాది మంది అభిమానుల మధ్య, అనుకూలమైన పరిస్థితుల్లో కూడా భారత్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Published By: HashtagU Telugu Desk
India vs South Africa

India vs South Africa

India vs South Africa: ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీనివల్ల టీమ్ ఇండియా కేవలం 111 పరుగులకే పరిమితమై, 76 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్ కొనసాగిస్తున్న వరుస విజయాల జోరుకు బ్రేక్ పడింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ల విజృంభణ

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రామ్ 4 పరుగులు, క్వింటన్ డికాక్ 6 పరుగులు, రయాన్ రికెల్టన్ 7 పరుగులకే పెవిలియన్ చేరారు. కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), అనుభవజ్ఞుడైన డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63) ఆదుకున్నారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఆ జట్టు 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.

Also Read: త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

భారత్ ఆశ్చర్యకర ఓటమి

సొంత గడ్డపై, లక్షలాది మంది అభిమానుల మధ్య, అనుకూలమైన పరిస్థితుల్లో కూడా భారత్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పవర్‌ప్లే ముగిసేసరికి కేవలం 31 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ గత మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఒత్తిడిలో ఉన్న ఆయన, ఈసారి 12 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సేపు క్రీజులో ఉన్నా హార్దిక్ 18 పరుగులకే వెనుదిరగడంతో భారత్ 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

శివమ్ దూబే పోరాటం వృథా

భారత జట్టులో శివమ్ దూబే ఒక్కడే దక్షిణాఫ్రికా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. 37 బంతుల్లో 42 పరుగులు చేసినప్పటికీ అవతలి వైపు సహకారం లేకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో 2023 త‌ర్వాత ఐసీసీ టోర్నీలో భార‌త్ ఆడి ఓడిన తొలి మ్యాచ్ ఇదే కావడం గ‌మ‌నార్హం.

  Last Updated: 22 Feb 2026, 10:52 PM IST