India vs Pakistan : ఇండియా వర్సెస్ పాక్.. 60ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అమీతుమీ

India vs Pakistan : భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ అంటే క్రీడా ప్రియులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 08:47 AM IST

India vs Pakistan : భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ అంటే క్రీడా ప్రియులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. క్రికెట్ ఒక్కటే కాదు.. ఇరు జట్ల మధ్య ఆట ఏదైనా సరే ఉద్వేగం, ఉత్సాహం మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. అలాంటిది పాకిస్థాన్​ గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ఆడుతుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన  అవసరం లేదు. కచ్చితంగా ఈ పోటీ క్రీడాప్రియులకు పండుగ వాతావరణాన్ని అందిస్తుంది. అయితే ఇప్పుడు డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ కోసం చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్​తో సమరానికి సై అంటోంది భారత్‌. పాక్ గడ్డపై 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెన్నిస్‌ జట్టు అడుగుపెట్టింది. డేవిస్‌ కప్‌ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.  ఇస్లామాబాద్‌ వేదికగా ఇవాళ, రేపు(3, 4 తేదీల్లో) పాకిస్తాన్‌తో ఇండియా(India vs Pakistan) తలపడనుంది.

We’re now on WhatsApp. Click to Join

ఇప్పటివరకు పాక్ జట్టుతో ఏడుసార్లు తలపడిన భారత్‌ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. గ్రాస్‌ కోర్టులో జరుగుతున్న ఈ పోరులో ఇప్పుడు భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చివరిసారిగా 1964లో పాకిస్థాన్​లో ఆడినప్పుడు భారత్‌ 4-0తో ఘన విజయం సాధించింది. ఇక 2019లో తటస్థ వేదికలో ఆడినప్పుడు ఆఖరిగా అంతే తేడాతో దాయాదిని ఓడించింది. అయితే ఈసారి పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. పాక్ టీమ్‌లో అసిమ్‌ ఖురేషి, అకీల్‌ ఖాన్‌ రూపంలో అనుభవజ్ఞులైన ప్లేయర్స్​ ఉన్నారు. ఇవాళ(శనివారం) జరిగే తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో రామ్‌కుమార్‌తో అసిమ్‌ ఖురేషి, రెండో సింగిల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీతో అకీల్‌ ఖాన్‌ పోటీపడనున్నారు. రేపు (ఆదివారం) జరిగే డబుల్స్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి ద్వయం బర్కతుల్లా-ముజామిల్‌ మొర్తజాతో తలపడనున్నారు. అదే రోజు రివర్స్‌ సింగిల్స్‌లో రామ్‌కుమార్‌తో అకీల్‌, శ్రీరామ్‌తో ఖురేషి తలపడతారు. ఇస్లామాబాద్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్​ను నేరుగా ఎంపిక చేసిన 500 మంది అతిథులు, అభిమానులు మాత్రమే చూడబోతున్నారు. నికీ పూంచా రూపంలో మరో సింగిల్స్‌ ప్లేయర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ గ్రాస్‌ కోర్టులో అతడి కన్నా బాలాజీనే బెటర్ అని ఇండియా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించింది.

Also Read : DSC – TET : డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లపై క్లారిటీ.. రెండేళ్లు ‘అప్రెంటిస్‌షిప్‌’

  • సోనీ లివ్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డేవిస్ కప్ మ్యాచ్‌ను లైవ్‌లో చూడొచ్చు.
  • సోనీ టెన్ ఛానెల్‌లు కూడా భారత్ వర్సెస్ పాకిస్థాన్ డేవిస్ కప్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.