Site icon HashtagU Telugu

India vs England: ఇంగ్లాండ్‌ను అధిగ‌మించిన భార‌త్.. చ‌రిత్ర సృష్టించిన జ‌డేజా, ఏకైక ఆట‌గాడిగా రికార్డు!

India vs England

India vs England

India vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా (India vs England) ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగారు. ఈ వార్త రాసే స‌మ‌యానికి ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకోవడమే కాకుండా భారత జట్టును కష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడేశారు. ఈ కీలక భాగస్వామ్యంతో, ఇంగ్లాండ్ నిర్దేశించిన 311 పరుగుల లీడ్‌ను భారత్ అధిగమించింది. ప్రస్తుతం భారత్ 11 పరుగుల స్వల్ప ఆధిక్యంతో ఇంగ్లాండ్‌పై ముందంజలో ఉంది. జడేజా, సుందర్ బ్యాటింగ్ ప్రదర్శన టీమిండియాకు ఈ మ్యాచ్‌లో ఒక పటిష్టమైన స్థానాన్ని కల్పించింది. ఈ వార్త రాసే టైమ్‌కు భార‌త్ జ‌ట్టు 120 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 333 ప‌రుగులు చేసింది.

చ‌రిత్ర సృష్టించిన జ‌డేజా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు సూపర్‌స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధ సెంచరీలు సాధించి, జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో బంతి, బ్యాట్ రెండింటితో అద్భుతమైన ప్రదర్శన చేసి జడేజా ఇంగ్లీష్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఆసియా ఆటగాడిగా నిలవడమే కాకుండా ఒక దిగ్గజంతో సమానంగా నిలిచాడు.

Also Read: PM Modi: రాజేంద్ర చోళ ప్రథమ గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేసిన ప్ర‌ధాని.. ఎవ‌రీ చ‌క్ర‌వ‌ర్తి?!

ఇంగ్లీష్ గడ్డపై జడేజా అరుదైన రికార్డు

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో రవీంద్ర జడేజా తన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సిరీస్‌లో జడేజా 5 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ ప్రదర్శనతో ఇంగ్లీష్ గడ్డపై టెస్ట్ క్రికెట్‌లో తన 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతతో ఇంగ్లీష్ గడ్డపై 30+ వికెట్లు తీసి, అదే సమయంలో 1,000 పరుగులు కూడా సాధించిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. ఆసియా నుండి ఏడుగురు బ్యాట్స్‌మెన్ ఇంగ్లీష్ గడ్డపై 1,000 కంటే ఎక్కువ పరుగులు సాధించగా, 18 మంది బౌలర్లు 30+ వికెట్లు తీశారు. అయితే, ఈ రెండు ఘనతలను ఒకే ఆటగాడు సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం జడేజా బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు.

గ్యారీ సోబర్స్ సరసన జడేజా

ఒక టెస్ట్ సిరీస్‌లో నంబర్ 6 లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసిన ఆటగాడిచే అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ పేరిట ఉంది. సోబర్స్ ఒక సిరీస్‌లో 5 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా అతనితో సమానంగా నిలిచాడు. సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో కూడా జడేజా అర్ధ సెంచరీ సాధిస్తే, ఈ జాబితాలో అతను అగ్రస్థానంలో నిలుస్తాడు. భారత్ తరపున వీవీఎస్ లక్ష్మణ్ కూడా 2002లో ఒక సిరీస్‌లో 5 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంతితోనూ జడేజా 4 కీలక వికెట్లు పడగొట్టాడు.