India vs England: ఇంగ్లాండ్ టూర్‌లో మరో సమరానికి భారత్ (India vs England) రెడీ అయింది. తొలి మ్యాచ్ ఓటమి నుంచి కోలుకున్న టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. అయితే భారత తుది జట్టుపై ఇంకా క్లారిటీ లేదు.మొదటి టెస్టులో మిడిలార్డర్ వైఫల్యం, బౌలర్ల ఫెయిల్యూర్ తో తుది జట్టులో మార్పులపై కోచ్ గౌతమ్ గంభీర్ ఫోకస్ పెట్టాడు. ఒకటిరెండు మార్పులు జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడడంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వర్క్ లోడ్ ను దృష్టిలో పెట్టుకుంటే బుమ్రాకు రెస్ట్ ఇవ్వొచ్చు. అయితే సిరీస్ లో వెనుకబడకుండా ఉండాలంటే అతన్ని ఆడించాల్సిందే. పైగా గత మూడురోజులుగా బుమ్రా ప్రాక్టీస్ సెషన్ లో శ్రమించాడు. కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే బుమ్రాపై తుది నిర్ణయం తీసుకుంటామని టీమ్ మేనేజ్ మెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇస్తే అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ లలో ఒకరికి చోటు దక్కుతుంది.
అలాగే ఎడ్జ్ బాస్టన్ పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు స్పిన్నర్లతో ఆడే ఛాన్సుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కుల్దీప్ లేదా వాషింగ్టన్ సుందర్ లలో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. ఇక శార్థూల్ ఠాకూర్ ను తప్పించి నితీశ్ రెడ్డిని ఆడించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొదటి టెస్టులో శార్థూల్ ఠాకూర్ 1, 4 పరుగులు చేసి అవుటవ్వగా.. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తే టీమిండియా మిడిలార్డర్ మరింత బలంగా అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా ఆడనున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు నిలదొక్కుకున్నా భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. నమోదైన సెక్షన్లు ఇవే!
మరోవైపు ఇంగ్లాండ్.. రెండో టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన కాంబినేషన్ తోనే బరిలోకి దిగుతోంది. ఇటీవల కౌంటీల్లో ఆడి టెస్టు జట్టులోకి వచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించలేదు.ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఎడ్జ్ బాస్టన్ పిచ్ మొదటి రెండురోజులు పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా.. ఈ గ్రౌండ్ లో భారత్ రికార్డులు ఏమాత్రం బాగాలేవు. ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు. ఇప్పటి వరకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత్ 8 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏడు మ్యాచ్‌లు ఓడిపోగా ఒక్క మ్యాచ్ డ్రా అయింది.