Site icon HashtagU Telugu

India Beat Zimbabwe: దర్జాగా సెమీస్‌కు… జింబాబ్వేను చిత్తు చేసిన భారత్‌

Team India Schedule

Team India Schedule

టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ 12 స్టేజ్‌ను భారత్ టాప్ ప్లేస్‌తో ముగించింది. గ్రూప్ 2 నుంచి చివరి మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా అగ్రస్థానంతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. జింబాబ్వే ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన వేళ 71 పరుగుల తేడాతో రోహిత్‌సేన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ రాహల్ , సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో భారీస్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ హైలెట్‌గా చెప్పాలి. తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన వేళ స్కై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు భారత్ 150 స్కోర్ చేస్తుందనుకున్న దశలో సూర్యకుమార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఆరంభంలో రోహిత్ నిరాశ పరిచినా.. రాహుల్, కోహ్లీ కీలక పార్టనర్‌షిప్‌తో భారత్ కోలుకంది. మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్‌తో అమాంతం స్కోర్ పెంచేశాడు. విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అప్పటి వరకూ సింగిల్స్ తీసిన సూర్య ఒక్కసారిగా సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్య కుమార్ జోరుకు చివరి 5 ఓవర్లలో భారత్ 56 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో ఏకంగా 21 రన్స్ వచ్చాయి. మొత్తం మీద సూర్యకుమార్ మెరుపులు అభిమానులను అలరించాయి. స్కై కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

187 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి తొలి బంతి నుంచే తడబడింది. సికిందర్ రాజా, ర్యాన్ బుర్ల్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. రాదా 24 బంతుల్లో 34 , బుర్ల్‌ 22 బంతుల్లో 35 పరుగులు చేయడంతో జింబాబ్వే స్కోర్ 100 పరుగులు దాటగలిగింది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. చివరికి ఆ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3 , పాండ్యా 2, షమీ 2 , అర్షదీప్‌, భువనేశ్వర్, అర్షదీప్‌సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో గ్రూప్ 2లో 8 పాయింట్లు సాధించిన భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బుధవారం తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనుండగా.. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడతాయి.

Exit mobile version