India ODI Series : టీమిండియా కెప్టెన్‌ గా కెఎల్ రాహుల్.. ఆసీస్‌ తో వన్డే సిరీస్‌ కు భారత జట్టు ఇదే

ఆసియాకప్ గెలిచిన టీమిండియా (India) వరల్డ్‌ కప్‌ కు ముందు ఆస్ట్రేలియా (Australia)తో సిరీస్ ఆడబోతోంది.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 10:04 PM IST

India vs Australia One-Day Series : ఆసియాకప్ గెలిచిన టీమిండియా (India) వరల్డ్‌ కప్‌ కు ముందు ఆస్ట్రేలియా (Australia)తో సిరీస్ ఆడబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో తొలి రెండు వన్డేలకు సీనియర్ ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చారు. రోహిత్ శర్మ,కోహ్లీ, హార్థిక్ పాండ్యా, కుల్‌దీప్‌ యాదవ్‌లకు రెస్ట్ ఇచ్చారు. రోహిత్‌కు రెస్ట్ ఇవ్వడంతో తొలి రెండు వన్డేలకు భారత జట్టును కెఎల్ రాహుల్ నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. అయితే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అలాగే ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రుతురాజ్ గైక్వాడ్‌ కూడా ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు చోటు దక్కించుకున్నాడు. ఇక మూడో వన్డేకు రోహిత్ శర్మ, కోహ్లీ, పాండ్యా జట్టుతో చేరనున్నారు. ఆ మ్యాచ్‌కు పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఆసియాకప్‌ ఆడుతూ గాయపడిన అక్షర్‌ పటేల్‌ తొలి రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ కొనసాగనుండగా.. తెలుగు తేజం తిలక్‌ వర్మ తొలి రెండు వన్డేలకు ఎంపికయ్యాడు. టీ ట్వంటీ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తూ వన్డేల్లోనూ అరంగేట్రం చేసిన తిలక్‌వర్మకు ఈ సిరీస్ చక్కని అవకాశంగా చెప్పొచ్చు. అక్షర్ పటేల్ మూడో వన్డేకు ఎంపికైనా అతని ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని టీమిండియా (India) మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇదిలా ఉంటే శ్రేయాస్ అయ్యర్‌ కూడా మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆసియాకప్‌ మధ్యలోనే అయ్యర్ ఫిట్‌నెస సమస్యలతో తప్పుకోవడంతో కాస్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు ఎన్‌సీఎలో శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సిరీస్ కావడంతో ఆటగాళ్ళ ఫిట్‌నెస్‌ కీలకం కానుంది.

కాగా తొలి మ్యాచ్‌కు మొహాలీ, రెండో వన్డేకు ఇండోర్, మూడో మ్యాచ్‌కు రాజ్‌కోట్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు మొదలు కానుండగా…ఆసీస్‌పై సిరీస్ గెలిచి మెగా టోర్నీకి మరింత జోష్‌తో సిద్ధం కావాలని భారత్ కోరుకుంటోంది.

ఆసీస్‌ (Australia)తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు:

కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆసీస్‌తో మూడో వన్డేకు భారత (India) జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్

Also Read:  Bigg Boss 7 : ఈసారి టాప్ 5 లో అతను పక్కానా..?