చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

వరుణ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టినందుకు ప్రతిఫలం దక్కింది. అర్ష్‌దీప్ నాలుగు స్థానాలు ఎగబాకి బౌలర్ల ర్యాంకింగ్‌లో 16వ స్థానానికి చేరుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Varun Chakravarthy

Varun Chakravarthy

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో చ‌రిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్న‌ర్‌
  • అత్యుత్తమ రేటింగ్ సాధించిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి

Varun Chakravarthy: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఏ భారతీయ బౌలర్ కూడా అందుకోలేనంతటి గొప్ప మైలురాయిని వరుణ్ చేరుకున్నారు. క్రికెట్ ఫార్మాట్లలో అత్యంత చిన్నదైన టీ20ల్లో అత్యుత్తమ రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల్లోనే ఆయన 6 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా మూడో టీ20లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి సత్తా చాటారు.

Also Read: ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

చరిత్ర సృష్టించిన వరుణ్

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో వరుణ్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆయన, తన పొజిషన్‌ను మరింత పదిలం చేసుకున్నారు. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. వరుణ్ ప్రస్తుతం 818 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నారు. వరుణ్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. 2025లో ఇప్పటివరకు ఆడిన 19 మ్యాచ్‌ల్లో ఆయన 32 వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆయన ఎకానమీ 6.69గా మాత్రమే ఉండటం విశేషం. గతేడాది ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఆయన 17 వికెట్లు పడగొట్టారు.

అర్ష్‌దీప్, తిలక్ వర్మలకు దక్కిన ప్రయోజనం

వరుణ్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టినందుకు ప్రతిఫలం దక్కింది. అర్ష్‌దీప్ నాలుగు స్థానాలు ఎగబాకి బౌలర్ల ర్యాంకింగ్‌లో 16వ స్థానానికి చేరుకున్నారు. మూడో టీ20లో ఆయన 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. మరోవైపు బ్యాటర్ల ర్యాంకింగ్‌లో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 4వ స్థానానికి చేరుకున్నారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రామ్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకారు.

  Last Updated: 17 Dec 2025, 04:20 PM IST