India Defeated Pakistan: పాకిస్థాన్‌తో జరిగిన టీ-20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు తన టిక్కెట్‌ను ఖాయం చేసుకుంది. కొలంబోలో జరిగిన ఈ పోరులో భారత్ తరపున ఇషాన్ కిషన్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తమ బౌలింగ్‌తో మాయాజాలం చేశారు. భారత్ 61 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనితో గ్రూప్-Aలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సూపర్ 8కు అర్హత సాధించింది.
భారత్ స్కోరు 175 పరుగులు
భారత్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 4 బంతుల్లో డకౌట్ అయి నిరాశపరిచాడు. తిలక్ వర్మ 24 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 పరుగులు జోడించాడు. చివరిలో శివమ్ దూబే 17 బంతుల్లో 27 పరుగులు చేయడంతో, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
Also Read: మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?
కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు 4 కీలక వికెట్లను కోల్పోయింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, సాయిమ్ అయూబ్ 6 పరుగులు, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా 4 పరుగులు మాత్రమే చేశారు. వెటరన్ బ్యాటర్ బాబర్ ఆజం సైతం 7 బంతుల్లో 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కాసేపు పోరాడి 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు, కానీ అతడిని కూడా అక్షర్ పటేల్ బోల్తా కొట్టించాడు. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
మెరిసిన బుమ్రా, అక్షర్
భారత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా, బుమ్రా కూడా 2 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ నడ్డి విరిచారు.
