Ind Vs NZ 2nd T20: లెక్క సరి చేశారు… రెండో టీ ట్వంటీ భారత్ దే

న్యూజిలాండ్ తో లెక్క సరి చేసింది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - January 29, 2023 / 10:32 PM IST

Ind Vs NZ 2nd T20: న్యూజిలాండ్ తో లెక్క సరి చేసింది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులకే కట్టడి చేశారు. ఓపెన‌ర్లు ఫిన్ అలెన్‌, డెవాన్ కాన్వే ధాటిగానే న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ఆర‌భించారు.

అయితే వారి జోరుకు భారత స్పిన్నర్లు బ్రేక్ వేశారు. చాహ‌ల్ , కుల్దీప్ యాద‌వ్‌, దీప‌క్ హుడా స్పిన్ ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డ్డారు.కెప్టెన్ శాంట్న‌ర్ 20 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కాగా తొలి టీ20 మ్యాచ్‌లో ధారాళంగా ప‌రుగులు ఇచ్చి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న అర్ష‌దీప్ సింగ్ రెండో టీ20లో మాత్రం ఒకే ఓవ‌ర్ వేసి మూడు ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.చాహ‌ల్ రెండు ఓవ‌ర్లు వేసి నాలుగు ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు. అత‌డితో పాటు హార్దిక్ పాండ్య, దీప‌క్ హుడా, సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్ ల‌కు త‌లో ఒక్క వికెట్ ద‌క్కింది.

100 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ కూడా తడబడుతూ సాగింది. గిల్ 11 , ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13 పరుగులకు ఔటయ్యారు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా నిరాశ పరచడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్య సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో భారత్ 19.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ విజయంతో సీరీస్ ను 1-1 తో సమం చేసింది. సీరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా బుదవారం జరుగుతుంది