Site icon HashtagU Telugu

IND vs AUS: టీమిండియానే ఫిరోజ్ ”షా”.. రెండో టెస్టులోనూ ఆసీస్ చిత్తు

ind vs aus

Resizeimagesize (1280 X 720) (1) 11zon (1)

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా (TeamIndia) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్‌ రోహిత్ శర్మ (31 పరుగులు) మెరవగా.. పూజారా (31 నాటౌట్), భరత్ (20 నాటౌట్) పరుగులతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

వేదిక మారినా ఫలితం మారలేదు.. భారత్ స్పిన్ ను ఎదుర్కోవడంలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయంటూ ప్రగల్బాలు పలికిన ఆస్ట్రేలియా మరోసారి చేతులెత్తేసింది. భారత్ స్పిన్నర్ల మ్యాజిక్ ముందు కంగారూలు తల వంచిన వేళ ఢిల్లీ టెస్ట్ కూడా మూడున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడోరోజు రవీంద్ర జడేజా చెలరేగడంతో ఆసీస్ 113 రన్స్ కే కుప్ప కూలింది.

Also Read: T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్… ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

నిన్న చివరి సెషన్ లో దూకుడుగా ఆడిన ఆసీస్ కు మన స్పిన్నర్లు ఇవాళ కళ్లెం వేశారు. తొలి సెషన్ ఆరంభం నుంచే వారిని కంగారెత్తించారు. జడేజా , అశ్విన్ చెరొక ఎండ్ నుంచీ చెలరేగిపోవడంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ కోలుకోలేక పోయింది. ఫలితంగా కంగారూ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో 113 రన్స్ కే కుప్పకూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఈ సీరీస్ లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు.

అయితే 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కూడా వికెట్లు కోల్పోయింది. రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. రోహిత్ పుజారా కోసం రనౌట్ అవడంతో మ్యాచ్ కాసేపు ఆసక్తికరంగా మారినట్టు కనిపించింది. కోహ్లీ , పుజారా ఇన్నింగ్స్ కొనసాగించారు. కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ ఔటైనా వందో టెస్ట్ ఆడుతున్న పుజారా, ఆంధ్రా ప్లేయర్ భరత్ తో కలిసి నిలకడగా ఆడి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 రన్స్ చేయగా…భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించింది. తాజాగా రెండో టెస్టులోనూ అదరగొట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు మరింత చేరువైంది.

Exit mobile version