Site icon HashtagU Telugu

IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్

Ind Vs Sl,3rd T20,weather Report

Ind Vs Sl,3rd T20,weather Report

IND vs SL 3rd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా, శ్రీలంక మధ్య ఈ రోజు చివరి మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో టీమిండియా 2-0తో ముందంజలో ఉంది. ఒకవైపు సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ కన్నేసింది. మరోవైపు శ్రీలంక వన్డే సిరీస్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది.టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా ఈ సిరీస్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆతిథ్య జట్టును ఓడించింది. శ్రీలంక కచ్చితంగా బ్యాటింగ్‌తో సత్తా చాటినప్పటికీ దానిని విజయంగా మార్చుకోలేకపోయింది. దీనికి అతి పెద్ద కారణం.. ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌లు శుభారంభం అందించినా ఆ తర్వాత వరుసగా వికెట్లు నేలకూలడంతో పరిస్థితి తలక్రిందులైంది.

పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు కాబట్టి చివరి మ్యాచ్‌లో వారి నుండి జట్టు బలమైన ప్రదర్శనను ఆశిస్తోంది. అలాగే శ్రీలంక బౌలర్లు కూడా సరైన లైన్ లెంగ్త్ పాటించాల్సి ఉంటుంది. మతిషా పతిరనా టీమ్‌ఇండియాని ఇరుకున పెట్టేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఈ కుర్రాడి యార్కర్లకు సీనియర్లు సైతం ఫిదా అవుతున్నారు. భారత్ వైపు నుంచి యశస్వి జైస్వాల్ మరోసారి శుభారంభం అందించే బాధ్యతను తీసుకుంటే మ్యాచ్ సగం విజయం సాధించినట్టే.

ప్రధాన ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆకట్టుకుంటున్నాడు, ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్‌కు అవకాశం లభిస్తుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రెండో టీ20లో పరాగ్ లంకేయులను ఇబ్బంది పెట్టాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు. ఎలాగో సిరీస్ మనదైనప్పుడు ప్రయత్నం చేస్తే తప్పేంటని హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ భావిస్తున్నారట. హార్ధిక్‌ పాండ్యా, సిరాజ్‌లతో పాటు రియాన్‌ పరాగ్‌లకు రెస్ట్‌ ఇచ్చి.. వారి స్థానంలో బెంచ్ మీదున్న శివమ్‌ దూబే, ఖలీల్‌ అహ్మద్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను బరిలోకి దింపాలని చూస్తున్నారు.

పల్లెకెలె స్టేడియంలోని పిచ్‌ మొదట్లో ఫాస్ట్ బౌలర్‌లకు కొంత సహాయం లభించినా క్రమంగా బ్యాట్స్‌మెన్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే స్పిన్ బౌలర్లు కూడా ఇక్కడ టర్న్ తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో పిచ్ అంశం మ్యాచ్ ఫలితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. ఇదిలా ఉండగా భారత్-శ్రీలంక మధ్య జరిగే మూడో మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. జూలై 30న పల్లెకెలెలో 55-60 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించగా, రెండో మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతిలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు జరిగే ఈ టూర్‌లో టీం ఇండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా ఆడనుంది.

Also Read: Hardik Pandya: అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ భావోద్వేగం