IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత జట్టు ఓమన్‌పై అద్భుతమైన ప్రదర్శనతో గెలుపు హ్యాట్రిక్ నమోదు చేసింది. భారత్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో అద్భుతమైన ఆటతీరుతో అన్నింటినీ గెలుచుకుంది. సెప్టెంబర్ 14న భారత్ పాకిస్థాన్‌తో (IND vs PAK) మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ఇప్పుడు మరోసారి భారత్- పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో చేతులు కలుపుతుందా? దీనికి సూర్యకుమార్ యాదవ్ సమాధానం ఇచ్చారు.
సూర్య సమాధానం ఇదే
హ్యాండ్‌షేక్ వివాదంపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “మీరు ఇంకే విషయాల గురించి మాట్లాడుతున్నారు? (నవ్వుతూ). మీరు బంతితో మా ప్రదర్శన గురించి మాట్లాడుతున్నారా? (నవ్వుతూ). ఇది బ్యాట్, బంతి మధ్య మంచి పోరాటం. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండి ఉంది. మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం, మీ దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చాలా మంచి విషయం” అని అన్నారు.
Also Read: Minister Savitha: బీసీ యువతకు ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి సవిత
సూర్యకుమార్ యాదవ్ ఇంకా మాట్లాడుతూ.. తమ జట్టుపై పాకిస్థాన్‌తో ఆడాలనే ఒత్తిడి ఎక్కువగా లేదని, ఎందుకంటే వారు పూర్తి ప్రక్రియపై దృష్టి పెట్టి, అవసరమైన పనులపై దృష్టి సారించారని తెలిపారు. తమ ఆటగాళ్లకు బయటి శబ్దాలకు దూరంగా ఉండి, తమ ఆటపై దృష్టి పెట్టాలని తాను సందేశం ఇస్తున్నానని కూడా ఆయన చెప్పారు.
భారత జట్టు పట్టించుకోలేదు
పాకిస్థాన్‌తో ఈనెల 14న జరిగిన మ్యాచ్‌లో టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ తర్వాత కూడా భారత జట్టు మొత్తం పాకిస్థాన్ జట్టుతో చేతులు కలపలేదు. దీనిపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండ్రీ ప్రాయ్‌క్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ పీసీబీ డిమాండ్‌ను తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి భారత్, పాకిస్థాన్‌ల మధ్య సెప్టెంబర్ 22న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది.
