Site icon HashtagU Telugu

IND vs PAK: టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండానే మైదానం నుండి వెళ్లిపోయిన‌ నఖ్వీ.. వీడియో వైరల్!

IND vs PAK

IND vs PAK

IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను (IND vs PAK) ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కానీ మ్యాచ్ తర్వాత జరిగిన గందరగోళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి టీమిండియా ఇప్పటికీ ఆసియా కప్ 2025 ట్రోఫీ దక్కలేదు. దీనికి కారణం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి టీమ్ ఇండియా నిరాకరించడమే. దీని తర్వాత మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని మైదానం నుండి నేరుగా తన హోటల్‌కు వెళ్లిపోగా, టీమిండియా ట్రోఫీ లేకుండానే విజయాన్ని జరుపుకుంది.

మొహ్సిన్ నఖ్వీ వీడియో వైరల్

పాకిస్తాన్ ప్రభుత్వంలో మొహ్సిన్ నఖ్వీ మంత్రిగా ఉండటం వల్లే ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోమని టీమిండియా మ్యాచ్‌కు ముందే స్పష్టం చేసింది. ఒకవేళ నఖ్వీ మంత్రి కాకపోయి ఉంటే భారత జట్టు ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేది. మ్యాచ్ ముగిసిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ పోడియంపై ట్రోఫీ పట్టుకుని భారత జట్టు కోసం చాలాసేపు వేచి ఉన్నారు. కానీ భారత జట్టు ఆయనకు దూరంగా స్టేడియంలోనే నిలబడి విజయాన్ని ఆస్వాదించింది.

Also Read: Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నఖ్వీ ట్రోఫీని పక్కకు తీయించి మైదానం నుండి వేగంగా వెళ్ళిపోయారు. మైదానం నుండి హడావుడిగా బయటకు వెళ్తున్న నఖ్వీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నఖ్వీ ఈ చర్యపై పాకిస్తాన్ క్రికెట్‌కు తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌ను 3 సార్లు ఓడించిన భార‌త్‌

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య 3 సార్లు పోరు జరిగింది. ఈ మూడు సార్లూ టీమిండియానే పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్లతో, రెండో మ్యాచ్‌లో 6 వికెట్లతో, ఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఫైనల్‌లో తిలక్ వర్మ, కులదీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో పాక్ జట్టు ఓటమి పాలైంది.

మొదటగా బౌలింగ్ చేసిన భారత్ తరఫున కులదీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను తిలక్ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Exit mobile version