అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup 2026

T20 World Cup 2026

IND vs PAK U-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 1న భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. జట్టులో వేదాంత్ త్రివేది మినహా మరే ఇతర ప్రధాన బ్యాటర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరియు ఆయుష్ మ్హ‌త్రే కూడా విఫలం కావడంతో టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించలేకపోయింది. అయినప్పటికీ భారత్ 58 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్ టికెట్ దక్కించుకుంది. భారత్ తరపున ఖిలన్ పటేల్, ఆయుష్ మ్హ‌త్రే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశారు.

భారత్ బ్యాటింగ్ ఇలా సాగింది

భారత్ తరపున ఆరోజ్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ కలిసి మొదటి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 47 పరుగుల వద్దే టీమ్ ఇండియాకు వరుసగా 3 ఎదురుదెబ్బలు తగిలాయి. ఆరోన్ జార్జ్ 16 పరుగులు చేయగా, వైభవ్ 22 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ ఆయుష్ మ్హ‌త్రే ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో వేదాంత్ త్రివేది ఒంటరి పోరాటం చేశాడు. అతను 98 బంతులు ఎదుర్కొని 68 పరుగులు చేశాడు (2 ఫోర్లు, 1 సిక్సర్).

Also Read: టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

మరోవైపు కనిష్క్ చౌహాన్ 29 బంతుల్లో 35 పరుగులు చేశాడు. భారత బ్యాటర్లలో చాలా మంది పాకిస్తాన్‌పై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో అబ్దుల్ సుబ్హాన్ 9.5 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ యూసుఫ్ 2 వికెట్లు తీశారు.

పాకిస్తాన్ ఓటమి

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హంజా జహూర్ 49 బంతుల్లో 42 పరుగులు (8 ఫోర్లు) చేశాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖాన్ 92 బంతుల్లో 66 పరుగులు (7 ఫోర్లు) చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. పాకిస్తాన్ జట్టు 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 58 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ తరపున ఖిలన్ పటేల్, ఆయుష్ మ్హ‌త్రే అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 3 వికెట్లు పడగొట్టారు.

  Last Updated: 01 Feb 2026, 10:53 PM IST