బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన ఆరు గంటలలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం.. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటినట్లు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయుగుండం రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో సోమవారం రోజున విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో కల్వర్టులు, కాలువల సమీపంలోకి వెళ్లవద్దని సూచించింది.
మరోవైపు ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ సీజన్ మీద పడుతోంది. ఎల్‌నినో కారణంగా అడపాదడపా వానలు పడుతున్నా.. సాగుకు అనుకూల వాతావరణం ఉండటం లేదు. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలోనూ జూన్ నెలలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. ఇక కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ బ్యారేజీలు నిండితే తప్ప దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. అయితే జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో.. ఎగువ జలాశయాలకు నీరు చేరలేదు. మరోవైపు గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికమైతే.. పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతుంది. ప్రస్తుతానికి అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు.
