Site icon HashtagU Telugu

IND vs PAK: మహిళల ప్రపంచ కప్‌లోనూ భారత్ వర్సెస్ పాకిస్తాన్.. హ్యాండ్‌షేక్ ఉండదా?

IND vs PAK

IND vs PAK

IND vs PAK: క్రీడా మైదానంలో భారత్, పాకిస్తాన్‌ల (IND vs PAK) మధ్య వైరం మరింత తీవ్రరూపం దాల్చుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల 2025లో జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఈ టోర్నీ సందర్భంగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ చేతులు కలపడానికి నిరాకరించడం పెద్ద చర్చనీయాంశమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం క్రీడలపై పడుతోందనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

మహిళల ప్రపంచ కప్‌లోనూ బహిష్కరణ ప్రచారం

ఆసియా కప్ వివాదం సద్దుమణగకముందే ఇదే తరహా పరిణామం ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ 2025లోనూ పునరావృతమవుతుందనే వార్తలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5న మహిళల ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత మహిళల జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లను బహిష్కరించి.. మ్యాచ్ అనంతరం చేతులు కలపకుండా దూరం పాటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పురుషుల జట్టు ఆసియా కప్‌లో అనుసరించిన వైఖరినే ఇప్పుడు మహిళల జట్టు కూడా అనుసరించాలని నిర్ణయించుకోవడం ఈ అంశానికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. ఈ చర్య రెండు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఘర్షణలను, క్రీడా మైదానంపై దాని ప్రభావాన్ని సూచిస్తోంది.

Also Read: Namibia: 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన న‌మీబియా!

భారత్ ఘన విజయం

మహిళల ప్రపంచ కప్ 2025లో భారత జట్టు ఇప్పటికే అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. వారు తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించారు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళా జట్టు దాయాది దేశం పాకిస్తాన్‌తో అక్టోబర్ 5న జరిగే మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.

ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు చేతులు కలపకపోవడం, మైదానంలో ఆధిపత్యం చెలాయించడంతో పాటు, మైదానం వెలుపల కూడా రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని చాటిచెప్పే విధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా? మ్యాచ్ అనంతరం జరిగే పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. క్రీడా స్ఫూర్తిని పక్కన పెట్టి దేశాల వైరాన్ని మైదానంలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమనే చర్చ కూడా క్రీడా వర్గాల్లో మొదలైంది.

Exit mobile version