IND vs PAK: భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా కేవలం 11వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన భారత బ్యాటర్లు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఫిబ్రవరి 13న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది మొదటి విజయం. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు యూఏఈ చేతిలో ఓటమి పాలవ్వగా, ఇప్పుడు పాకిస్థాన్‌ను ఓడించి తిరిగి ఫామ్‌లోకి వచ్చింది.
Also Read: Gold Crash: లక్ష రూపాయలకే తులం బంగారం !! ఏంటి నిజమా ?
8 వికెట్ల తేడాతో భారత్ విజయం
94 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. ఓపెనర్ హుమైరా కాజీ ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ అయింది. అయితే మరో ఓపెనర్ బృందా దినేష్ బ్యాట్‌తో విరుచుకుపడింది. కేవలం 25 బంతుల్లోనే ఆమె తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. మొత్తంగా 29 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అనుష్క శర్మ 24 పరుగులు చేయగా, తేజల్ హసబ్నిస్ 5 బంతుల్లో 12 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. టీమ్ ఇండియా బౌలర్లందరూ దాదాపు 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చి పాకిస్థాన్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.
సెమీఫైనల్ దిశగా భారత్
ఈ విజయంతో భారత జట్టు 2 పాయింట్లతో గ్రూప్-Aలో రెండో స్థానానికి చేరుకుంది. పాకిస్థాన్‌కు కూడా సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్-రేట్ విషయంలో భారత్ మెరుగ్గా ఉంది. సెమీఫైనల్‌లో చోటు ఖాయం చేసుకోవాలంటే భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 17న నేపాల్‌తో తలపడనుంది.
