IND vs PAK: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ మధ్య ఈరోజు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ భారత్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేసింది. అయితే చివరకు ఐసీసీ ముందు పాకిస్థాన్ తలొగ్గక తప్పలేదు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్- పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా అందులో టీమ్ ఇండియా 7 సార్లు విజయం సాధించింది, పాకిస్థాన్ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. అయితే తాజాగా జరగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
అయితే ఊహించినట్లుగానే రెండు జట్ల మధ్య షేక్ హ్యాండ్స్ (కరచాలనం) జరగలేదు. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. గత మ్యాచ్‌తో పోలిస్తే పాకిస్థాన్ జట్టులో ఎటువంటి మార్పులు లేవు. కానీ భారత్ రెండు మార్పులు చేసింది. సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మూడవ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
షేక్ హ్యాండ్ వివాదం
భారత జట్టు అనుసరిస్తున్న ఈ ‘నో-హ్యాండ్‌షేక్’ విధానం గత ఏడాది ఆసియా కప్‌లో మొదలైంది. అప్పట్లో భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడానికి నిరాకరించడంతో పెద్ద వివాదం రేగింది. దీనిపై పాకిస్థాన్ ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించింది. ఈ రాత్రి మ్యాచ్‌కు ముందు కూడా ఆట కంటే ఈ షేక్ హ్యాండ్ అంశమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. టీమ్ ఇండియా తన నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో పాకిస్థాన్ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
నరాలు తెగే ఉత్కంఠ.. కానీ వర్షం ముప్పు!
ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ పోరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారం రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి తర్వాత ఎట్టకేలకు కొలంబోలో ఈ మహా యుద్ధం మొదలైంది. అయితే వర్షం రూపంలో ఒక విలన్ పొంచి ఉన్నాడు. కొలంబోలో గత 36 గంటలుగా వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా గత 12 గంటల్లో పరిస్థితి మరింత దిగజారింది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావొచ్చు లేదా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. అయితే, శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్ పనితీరు, అక్కడి డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉండటం వల్ల మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆటగాళ్ల మధ్య దూరం
ఇటీవలి కాలంలో భారత్- పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య సంబంధాలు అంత బాగులేవు. ఆసియా కప్ షేక్ హ్యాండ్ వివాదం, పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ వ్యవహారం ఈ దూరాన్ని మరింత పెంచాయి. ప్రస్తుతం ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని చెప్పవచ్చు.
జట్ల వివరాలు
భారత ప్లేయింగ్ XI
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్డిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ ప్లేయింగ్ XI
సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.
