Boxing Day Test Tickets: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య గొడవలు కూడా బిజిటిని మరింత రసవత్తరంగా మార్చింది. తొలి టెస్టులో హర్షిత్ రాణా.. మిచెల్ స్టార్క్, యశస్వీ జైస్వాల్ మిచెల్ స్టార్క్ మధ్య కవ్వింపులు సాగాయి. ఇక రెండో టెస్టులో ట్రావిస్ హెడ్- మహ్మద్ సిరాజ్ మధ్య హైవోల్టేజ్ డ్రామా నడిచింది. దీంతో ఈ టోర్నీపై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
తొలి మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది కాగా రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సిరీస్ ఇప్పుడు ఒక్కొక్కటిగా సమమైంది. సిరీస్‌లో మూడో మ్యాచ్ గబ్బా మైదానంలో జరగనుంది. దీని తర్వాత మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. డిసెంబర్ 26 నుండి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనిని బాక్సింగ్ డే టెస్ట్ (Boxing Day Test Tickets) అని పిలుస్తారు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు 90,000 మందికి పైగా ప్రేక్షకులకు అవకాశముంది.
Also Read: Manish Pandey: స్టార్ క్రికెటర్ మనీష్ పాండేకు బిగ్ షాక్
బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ పెర్త్‌లో మరియు రెండవ టెస్ట్ అడిలైడ్‌లో జరిగింది. ఈ రెండు మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి చేరుకున్నారు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం మొదటి రెండు రోజులు దాదాపు నిండిపోయింది. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌కు మూడు రోజుల్లో భారీగా ప్రేక్షకులు వచ్చారు. మొదటి రోజు అడిలైడ్ ఓవల్‌లో 36,225 మంది ప్రేక్షకులు తరలివచ్చారు. రెండో రోజు మ్యాచ్‌ని చూసేందుకు 50 వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి చేరుకున్నారు. గబ్బా టెస్ట్ గురించి చెప్పాలంటే మొదటి రోజు మొత్తం ప్రేక్షకులతో స్టేడియం నిండిపోతుందని భావిస్తున్నారు. రెండో రోజు కూడా చాలా వరకు టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్‌గా ఈ టెస్టు సిరీస్ ఇప్పటి వరకు విజయవంతమైంది.