Site icon HashtagU Telugu

IND vs AUS: చితక్కొట్టిన స్మృతి మంధాన.. సూపర్ సెంచరీతో విధ్వంసం

IND vs AUS

IND vs AUS

IND vs AUS: టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో చారిత్రాత్మక ఇన్నింగ్స్ కు తెరలేపింది. భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 109 బంతుల్లో 105 పరుగులతో సత్తా చాటింది. అయితే స్మృతి సెంచరీతో కదం తొక్కినప్పటికీ టీమిండియా 83 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. వివరాలలోకి వెళితే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0తో భారత్‌ను (IND vs AUS) వైట్‌వాష్ చేసింది. పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో సెంచరీ నమోదు చేసింది. కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ 50 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో అజేయంగా 56 పరుగులు చేసింది. మిగిలిన యాష్లే గార్డనర్ 64 బంతుల్లో 50 పరుగులు చేసింది. కాగా 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన టీమ్ ఇండియాకు శుభారంభం లభించలేదు. 16 పరుగుల స్కోరు వద్ద రిచా ఘోష్ రూపంలో జట్టుకు తొలి దెబ్బ తగిలింది.

Also Read: 1.63 Lakh Crores: రూ.1.63 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి స‌హ‌క‌రించండి.. రేవంత్ కీల‌క విజ్ఞ‌ప్తి

ఆమె కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయింది. ఆ తర్వాత రెండో వికెట్‌కు స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ మధ్య 139 బంతుల్లో 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఈ క్రమంలో భారత్ లక్ష్యాన్ని సాధిస్తుందని అనిపించినా ఆ తర్వాత 28వ ఓవర్లో హర్లీన్ డియోల్ రూపంలో జట్టుకు మూడో దెబ్బ తగిలింది. హర్లీన్ 64 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ టీమిండియా 215 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధాన 109 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 105 పరుగులు చేసింది. స్మృతి మంధానకు ఇది 9వ వన్డే శతకం.

భారత్ తరఫున అరుంధతిరెడ్డి అత్యధికంగా 4 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డనర్ అత్యధికంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే సెంచరీతో మంధాన అరుదైన రికార్డు క్రియేట్‌ చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన మొదటి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 2024లో ఆమె దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై సెంచరీలు నమోదు చేసింది. ఇక ఆమె దక్షిణాఫ్రికాపై రెండు సార్లు శతకాలు సాధించింది.