Toss: క్రికెట్‌లో టాస్ గెలవడం అంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని ఒక నానుడి ఉంది. ముఖ్యంగా పిచ్, వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోయే టీ20ల్లో టాస్ పాత్ర చాలా కీలకం. టాస్ గెలవడం అనేది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉన్నప్పటికీ కొందరు కెప్టెన్లు ఒక పూర్తి సిరీస్‌లో ప్రతిసారీ టాస్ గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాంటి కొందరు కెప్టెన్లు ఎవరో చూద్దాం!
మహేల జయవర్ధనే – శ్రీలంక
శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేల జయవర్ధనే 2008/09లో కెనడాలో జరిగిన T20 కెనడా టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘనత సాధించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆయన మూడు సార్లూ టాస్ గెలిచారు. విశేషమేమిటంటే ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక ఘన విజయం సాధించింది. జయవర్ధనే క్రీడా జీవితంలో ఈ సిరీస్ అటు కెప్టెన్సీ పరంగా, ఇటు అదృష్టం పరంగా గుర్తుండిపోతుంది.
విలియం పోర్టర్ ఫీల్డ్ – ఐర్లాండ్
ఈ జాబితాలో రెండో వ్యక్తి ఐర్లాండ్ మాజీ కెప్టెన్ విలియం పోర్టర్ ఫీల్డ్. 2009-10లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 క్వాలిఫైయర్ టోర్నీలో ఆయన వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచారు. ఆయన నేతృత్వంలో ఐర్లాండ్ ఆడిన ఆ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. దీన్ని బట్టి టాస్ గెలిచినంత మాత్రాన విజయం గ్యారెంటీ కాదని అర్థమవుతుంది.
Also Read: క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?
స్టువర్ట్ బ్రాడ్ – ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఈ అరుదైన జాబితాలో ఉన్నారు. 2011-12లో పాకిస్థాన్‌తో యూఏఈ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో బ్రాడ్ మూడు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచారు. ఆ సిరీస్‌లో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.
మహమ్మద్ హఫీజ్ – పాకిస్థాన్
పాకిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకు గానూ మూడు సార్లూ టాస్ గెలిచారు. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ ఒక మ్యాచ్ గెలిచింది. ఒకటి ఓడిపోయింది. మరొకటి టై (Tie)గా ముగిసింది. టాస్ గెలిచినా మైదానంలో ప్రతిభ చూపడం ఎంత ముఖ్యమో ఈ సిరీస్ నిరూపించింది.
ఫాఫ్ డు ప్లెసిస్ – సౌత్ ఆఫ్రికా
2013లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన సౌత్ ఆఫ్రికా జట్టుకు ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ వహించారు. ఆ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆయన ప్రతిసారీ టాస్ గెలిచారు. ఆ సిరీస్‌లో ప్రోటీస్ జట్టు రెండు మ్యాచ్‌లు గెలవగా, ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
