టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డితే విజేత ఎవ‌రో తెలుసా?!

రిజర్వ్ డే (మార్చి 9) కూడా వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే అప్పుడు భారత్- న్యూజిలాండ్ జట్లను 'ఉమ్మడి విజేతలుగా' ప్రకటిస్తారు.

Published By: HashtagU Telugu Desk
T20 WC Final

T20 WC Final

IND vs NZ: 2026 టీ20 ప్రపంచకప్ సుమారు ఒక నెల క్రితం ప్రారంభమైంది. 54 మ్యాచ్‌ల హోరాహోరీ పోరు తర్వాత ఇప్పుడు ఫైనల్ సమయం రానే వచ్చింది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగా, న్యూజిలాండ్ తన మొదటి ప్రపంచకప్ టైటిల్ కోసం వేచి చూస్తోంది.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి. ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా?

Also Read: నేపాల్ ప్ర‌ధానిగా మాజీ మేయర్ బాలెన్ షా?

వర్షం పడితే ఏం జరుగుతుంది?

మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ ఆ రోజు నరేంద్ర మోదీ స్టేడియంలో వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే, ‘రిజర్వ్ డే’ నిబంధన అమల్లోకి వస్తుంది. అంటే ఆ మ్యాచ్‌ను మరుసటి రోజు, మార్చి 9న నిర్వహిస్తారు. అయితే 8వ తేదీనే మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందులో కనీసం 10 ఓవర్ల ఆట జరిగేలా చూడటం ప్రాథమిక లక్ష్యం.

రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడితే?

ఒకవేళ మార్చి 9న (రిజర్వ్ డే) కూడా వర్షం అంతరాయం కలిగిస్తే ఆ రోజు కూడా కనీసం 10 ఓవర్ల ఆటను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. నాకౌట్ మ్యాచ్‌లలో ఫలితం రావాలంటే ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి రోజు కొంత ఆట జరిగి, మధ్యలో ఆగిపోతే.. రిజర్వ్ డే నాడు ఆట ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండే ప్రారంభమవుతుంది.

ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారా?

ఒకవేళ రిజర్వ్ డే (మార్చి 9) కూడా వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే అప్పుడు భారత్- న్యూజిలాండ్ జట్లను ‘ఉమ్మడి విజేతలుగా’ ప్రకటిస్తారు. ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వడం చాలా అరుదు. గతంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇలాగే జరిగింది. అప్పుడు భారత్‌, శ్రీలంక జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు.

  Last Updated: 06 Mar 2026, 10:15 PM IST