ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు… ఐసీసీ తాజాగా ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆరు స్థానాలు ఎగబాకి 830 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకగా… మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి దూసుకెళ్లాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన రెండో టెస్టులో శ్రేయాస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్‌లలోను ఆర్ధసెంచరీలు సాధించాడు. అలాగే ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా బెంగళూరు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి టీమిండియా గెలవడంతో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మంచి ర్యాంకులు దక్కించుకున్నారు…
అయితే ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ జాసన్ హోల్డర్ మొదటి స్థానంలోకి దూసుకెళ్ళగా.. మూడో స్థానంలో టీమిండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ఇక ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకు మరింత కిందకి పడిపోయింది. శ్రీలంకతో రెండు టెస్టుల్లో కలిపి టెస్టు సిరీస్‌లో 81 పరుగులు చేసి దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి 9వ స్థానానికి పడిపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 754 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ కొనసాగుతున్నాడు.. ఇక ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 4వ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ అగ్ర స్థానంలో నిలిచాడు.