Site icon HashtagU Telugu

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ

Jadeja

Resizeimagesize (1280 X 720)

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు భారత లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీ-మెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది. అంపైర్ల అనుమతి లేకుండా మైదానంలో వేలికి క్రీమ్‌ రాసుకున్నందుకు జడేజాకు జరిమానా విధించినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, జడేజా బంతి పరిస్థితిలో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొంది. 120/5తో ఉన్న సమయంలో గురువారం మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానంలోని అంపైర్ల అనుమతి తీసుకోకుండానే జడేజా తన బౌలింగ్ చేతి చూపుడు వేలుపై వాపుకు క్రీమ్ రాసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయానికి జడేజా అప్పటికే మార్నస్ లాబుషాగ్నే, మాట్ రెన్షా, స్టీవెన్ స్మిత్‌లను అవుట్ చేశాడు.

జడేజా బౌలింగ్ ప్రారంభించే ముందు ఎడమ చేతి చూపుడు వేలుకు క్రీమ్ రాసుకున్నట్లు వీడియోలో చూపించారు. ఆ సమయంలో బంతి అతని చేతిలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీసింది. జడేజా తప్పు ఒప్పుకున్నాడు. ఎమిరేట్స్ ICC ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన శిక్షను అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదు. ఆట చట్టాలకు అనుగుణంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా మ్యాచ్ రిఫరీలు స్వతంత్రంగా ఇటువంటి సంఘటనలపై దర్యాప్తు చేయవచ్చు. క్రికెట్ చట్టాల ప్రకారం బంతి పరిస్థితి ప్రభావితం కాకుండా ఉండాలంటే, బౌలర్ తన చేతులపై ఎలాంటి పదార్థాన్ని ప్రయోగించాలో అంపైర్‌కు తెలియజేయాలి. అంపైర్‌ అనుమతిని పొందడం అవసరం.

Also Read: IND vs AUS 1st Test Match: స్పిన్ ఉచ్చులో విలవిల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాను భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను ముందుగా బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలిరోజు (గురువారం) భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 177 పరుగులకు కట్టడి చేశారు. అదే సమయంలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్ల ముందు ఆస్ట్రేలియా నిలవలేకపోయింది. ఆసీస్ జట్టు మొత్తం 91 పరుగులకే ఆలౌటైంది. మోకాలి గాయంతో ఐదు నెలల తర్వాత జడేజా అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగు పెట్టాడు. బంతితో రెండు ఇన్నింగ్స్‌లలో 5/47, 2/34తో రాణించాడు. జడేజా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కీలకమైన 70 పరుగులు సాధించి భారత ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.