Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ నజరానా ప్రకటించింది. జట్టుకు రూ.10 లక్షలు , వ్యక్తిగతంగా అదరగొట్టిన ప్లేయర్స్ కు రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్పారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ తిలక్‌వర్మ, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్, స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డికి తలో రూ.50 వేలు నగదు బహుమతిని అందుకోనున్నారు.
ఉప్పల్ స్టేడియంలో ముగిసిన రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను ఓడించింది. అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్ మోహన్ రావు ఆటగాళ్లకు బంపరాఫర్ ఇచ్చారు. వచ్చే 2-3 ఏళ్లలో రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ. కోటి, జట్టులోని ప్రతి ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు ఇస్తామని ప్రకటించారు.హైదరాబాద్ జట్టు ప్లేట్ నుంచి ఎలైట్ గ్రూప్ చేరుకోవడంతో ఒక లక్ష్యం పూర్తయిందని , వచ్చే సీజన్ లో ఎలైట్ గ్రూప్ లో జట్టు సత్తా చాటాలని ఆకాంక్షించారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రంజీ ట్రోఫీ చాంపియన్ గా నిలవాలన్నారు. దీనికి హెచ్ సీ ఏ తరఫున జట్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రానున్న రెండు సీజన్లలో హైదరాబాద్‌ను రంజీ ట్రోఫీ విజేతగా నిలపటమే లక్ష్యమని కెప్టెన్ తిలక్ వర్మ చెప్పాడు. ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా నగదు బహుమతి, కార్లు అందిస్తామని అసోసియేషన్ ప్రకటించటం సంతోషంగా ఉందన్నాడు.
Also Read: Ashika Ranganath : మెగా ఛాన్స్ పట్టేసిన ఆషిక రంగనాథ్.. చిరు విశ్వం భరలో ఛాన్స్..!