Site icon HashtagU Telugu

HCA Polls: హెచ్‌సిఎలో ఎన్నికల హీట్.. రేసులో నాలుగు ప్యానెల్స్‌

Hca Imresizer

Hca Imresizer

HCA Polls: దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించిన హైదరాబాద్‌ క్రికెట్ సంఘం కళతప్పిపోయింది. అవినీతి ఆరోపణలు ఓ వైపు, ఆధిపత్య పోరాటం మరో వైపు హెచ్‌సియే ప్రతిష్ఠను దిగజార్చాయి. ప్లేయర్లకు ప్రోత్సాహం అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాన్సిన హెచ్ సిఏ సభ్యులు గొడవలు, కోర్టు కేసులతోనే కాలం వెళ్లదీశారు. బీసీసీఐ నుంచి హెచ్ సి ఏ కు వస్తున్న కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు క్రికెట్ ప్రేమికులను కలవరపెడుతోంది. ఒకానొక దశలో ఉప్పల్ స్టేడియంలో కరెంట్ బిల్ కట్టలేక స్టెడియంకు పవర్ కట్ చేసిన పరిస్థితులు ఎదురయ్యాయంటే హెచ్‌సీఏ దీన స్థితి అర్థం చేసుకోవచ్చు. చివరి సారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్‌ అజరుద్దీన్‌ అధ్యక్షుడయ్యాడు. అజర్‌ హెచ్‌సీఏ ను గాడిన పెట్టకపోగా మరింత వివాదాల్లోకి నెట్టాడు. తోటి సభ్యులతో సమన్వయం చేసుకోకపోవడంతో హెచ్ సీఏ లో గొడవలు తారాస్థాయికి చేరటం చివరకు కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

దీంతో హెచ్ సీఏ కు జరగాల్సిన ఎన్నికలు సైతం వాయిదా పడుతూ వచ్చాయి. చివరికి సుప్రీంకోర్టు కలగజేసుకుని హెచ్ సీఏ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ లావు నాగేశ్వర్ రావ్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ నియమించింది. కమిటీ సూచనలతో పలు మార్పులతో ఎన్నికల నిర్వహణకు మార్గం సులువైంది. కీలకమైన ఆరు స్థానాల కోసం ఈ సారి నాలుగు ప్యానల్స్‌ హెచ్‌సీఏ ఎన్నికల బరిలో ఉన్నాయి. పలు పదవులకు పోటీపడుతున్న వారికి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కూడా ఉండటంతో ఈ ఎన్నికలు గులాబీ వర్సెస్‌ కమలంగా మారాయి. జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌ రావు అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మకంగా పావులు కదుతుపున్నారు. మసకబారుతున్న హెచ్‌సీఏ ను గాడిన పెట్టేందుకు జ‌గ‌న్‌మోహ‌న్ రావును బీఆర్‌ఎస్‌ కీలక నేతలు కేటీఆర్, కవిత, హరీశ్ రావులే బ‌రిలోకి దించిన‌ట్టు తెలుస్తోంది.

మరోవైపు బిజెపి కీలక నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకటస్వామి తన ప్యానల్‌ను రేసులో నిలిపారు. వివేక్‌ వెంకటస్వామి అండదండలతో మొట్టమొదటిసారి జిల్లాల నుంచి అపెక్స్ కౌన్సెల్ పోటీకి ఒక అభ్యర్థి ముందుకు వచ్చారు. కరీంనగర్ క్రికెట్ క్లబ్ నుంచి ఆగమ్ రావ్ హెచ్ సీఏ సెక్రటరీగా పోటీలో నిలిచారు. వీరితో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్‌ యాదవ్‌, అర్షద్‌ అయూబ్‌లు అమర్ నాధ్ అధ్యక్షతన ఒక ప్యానల్‌తో ముందుకొచ్చినా.. ఏండ్లుగా హెచ్‌సీఏను ఏలుతున్న పెద్దలు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఈ నెల 20న బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ ప్రారంభం ప్రారంభమై సాయంత్రానికి పోలింగ్ ముగిసి ఆ రోజే ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి గెలిచే ప్యానెల్ అయినా హెచ్ సీఏను గాడిన పెడ్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Nallu Indrasena Reddy : త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా న‌ల్లు ఇంద్ర‌సేనా రెడ్డి.. ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌