Site icon HashtagU Telugu

Boult Catch: బౌల్ట్ రిటర్న్ క్యాచ్‌… హర్షా భోగ్లే షాక్

boult catch

boult catch

Boult Catch: మైదానంలో మిస్ ఫీల్డ్ అనేది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఒక్క క్యాచ్ మిస్ అవ్వడం ద్వారా మ్యాచ్ తలక్రిందులు అవుతుంది. ఇక ఐపీఎల్ లో క్యాచ్ లకు పెట్టింది పేరు. మునుపెన్నడూ చూడని క్యాచ్ లు ఐపీఎల్ లోనే దర్శనమిస్తాయి. తాజాగా ఒక ఫన్నీ క్యాచ్ మైదానంలో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

నిన్న జరిగిన ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌ తలపడ్డాయి. ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సంపాదించింది. అయితే నిన్నటి మ్యాచ్ లో ఓ అద్భుతమైన క్యాచ్ అందర్నీ ఆకట్టుకుంది. కొన్ని క్షణాలు ఏం జరిగిందో అర్ధం కానీ పరిస్థితి.ట్రెంట్ బౌల్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్ వృద్దిమాన్ సాహాను రిటర్న్ క్యాచ్‌ తో పెవిలియన్ కి పంపించేశాడు. అయితే ఈ క్యాచ్ కోసం ముగ్గురు ఫీల్డర్లు పోటీపడ్డారు.. చివరకు ట్రెంట్ బౌల్ట్ అందుకోవడం చూపరులని ఆకట్టుకుంది.

బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని సాహా ఓవర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి అక్కడే పైకి లేచింది. అయితే ఇక్కడే గమ్మత్తైన ఘటన చోటుచేసుకుంది. ఈ క్యాచ్ కోసం కీపర్ సంజూ శాంసన్, స్క్వేర్ లెగ్ ఫీల్డర్ హెట్‌మైర్, పాయింట్ ఫీల్డర్ ధృవ్ జురెల్ ప్రయత్నించారు. ముగ్గురు ఒకరికొకరు ఢీకొట్టడంతో బంతి సంజూ శాంసన్ గ్లోవ్స్‌ను తాకి బంతి గాల్లోకి లేచింది. పక్కనే ఉన్న బౌలర్ బౌల్ట్ సునాయసంగా బంతిని చేతుల్లోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ట్రెంట్ బౌల్ట్ పట్టిన రిటర్న్ క్యాచ్‌పై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జీవితంలోనే ఇలాంటి రిటర్న్ క్యాచ్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నాడు. ముగ్గురు ఫీల్డర్లు ప్రయత్నించిన క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడం అద్భుతమని కొనియాడాడు.

నిన్న ఆదివారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌ తలపడ్డాయి.గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి గుజరాత్‌ 177 పరుగులు చేసింది.19.2 ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్ 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులతో విక్టరీ సాధించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మూడింటిలో విజయం సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్ కూడా నాలుగు మ్యాచులు ఆడి మూడింటిలో విజయం సాధించి ఆరు పాయింట్లతో ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణగా రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read More: Jio Cinema : జియో సినిమా సరికొత్త ప్లాన్.. IPL ఫ్రీ.. కానీ సినిమాలకు డబ్బులు కట్టాలి..