Site icon HashtagU Telugu

CWC 25: టీమిండియా అభిమానుల్లో టెన్ష‌న్ పెంచుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌ ఫొటో షూట్‌!

CWC25

CWC25

CWC25: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ (CWC 25) 2025 ఫైనల్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ టైటిల్ పోరు రేపు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. భారత్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించగా.., ప్రొటీస్ (దక్షిణాఫ్రికా) జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌ టికెట్ దక్కించుకుంది.

ఈసారి మహిళల ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కబోతున్నారు. ఎందుకంటే రెండు జట్లు కూడా తమ మొట్టమొదటి టైటిల్‌ను గెలవాలనే పట్టుదలతో మైదానంలోకి దిగనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుంది. అయితే ఈ పోరుకు ముందు భారత అభిమానుల గుండెల్లో గుబులు మొదలైంది. ఫైనల్‌కు ముందు ట్రోఫీతో ఇద్దరు కెప్టెన్లు నిర్వహించిన ఫొటోషూట్ టీమ్ ఇండియా ఓటమికి సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది. ఇంతకీ,ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం!

టీమిండియా అభిమానుల్లో టెన్ష‌న్‌

భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌కి ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఫొటోషూట్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం తమ సోషల్ మీడియా ఖాతాలలో ట్రోఫీతో ఉన్న ఇద్దరు కెప్టెన్ల మూడు చిత్రాలను పంచుకుంది. అయితే ఈ ఫోటోలు బయటకు రాగానే టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన పెరిగింది.

Also Read: KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

నిజానికి ఈ చిత్రాలలో భారత కెప్టెన్ ట్రోఫీకి కుడి వైపున, సౌతాఫ్రికా కెప్టెన్ ఎడమ వైపున పోజులిస్తూ కనిపించారు. గత కొన్ని ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్స్‌లో ఒక విచిత్రమైన సెంటిమెంట్ కనిపిస్తుంది. ఫొటోషూట్‌లో ఏ కెప్టెన్ అయితే ట్రోఫీకి కుడి వైపున నిలబడతారో ఆ జట్టు టైటిల్ పోరులో ఓటమిని చవిచూసింది. అందుకే ఫొటోలో హర్మన్‌ప్రీత్ కౌర్ కుడి వైపున నిలబడటాన్ని భారత జట్టు ఓటమికి సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు.

రోహిత్ శర్మకు రెండుసార్లు ఎదురైన దురదృష్టం

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో ఇలాంటి దురదృష్టం రెండుసార్లు జరిగింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2021-23లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. కానీ అక్కడ కూడా కంగారూ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఈ రెండు సందర్భాలలోనూ రోహిత్ శర్మ ట్రోఫీతో కుడి వైపున నిలబడగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఎడమ వైపున నిలబడ్డాడు. ఇది కేవలం రోహిత్‌కే కాదు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్కరమ్‌, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విషయంలో కూడా జరిగింది. వారిద్దరూ కూడా ఫొటోషూట్‌లో కుడి వైపున పోజులిచ్చారు. ఈ రెండు సందర్భాలలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ వైపున నిలబడి కనిపించాడు. ఈ సెంటిమెంట్‌ను గుర్తు చేసుకుంటూనే, ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కుడి వైపున ఉండటం భారత అభిమానులను కలవరపరుస్తోంది.

Exit mobile version