Gambhir chat with Surya : రెండో టీ20 మ్యాచ్ త‌రువాత‌.. కెప్టెన్ సూర్య‌తో కోచ్ గంభీర్ సుదీర్ఘ సంభాష‌ణ‌..

రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త విజ‌యానంత‌రం కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో కోచ్ గౌతమ్ గంభీర్ మైదానంలో మాట్లాడాడు.

Published By: HashtagU Telugu Desk
Gautam Gambhir Lengthy Chat With Suryakumar Yadav

Gautam Gambhir Lengthy Chat With Suryakumar Yadav

Gambhir chat with Surya : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ జ‌ట్టు (Team India) మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. ఆదివారం రాత్రి శ్రీలంక‌(Srilanka)తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. అనంత‌రం భార‌త ఇన్నింగ్స్ ఆరంభం కాగానే వ‌ర్షం ప‌డింది. దీంతో దాదాపు గంట‌కు పైగా స‌మ‌యం వృథా అయింది.

ఈ నేప‌థ్యంలో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో భార‌త ల‌క్ష్యాన్ని 8 ఓవ‌ర్ల‌లో 78 ప‌రుగులుగా నిర్ణ‌యించారు. అయితే.. సూర్య‌(12 బంతుల్లో 26), య‌శ‌స్వి జైస్వాల్ (15 బంతుల్లో 30), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 22నాటౌట్‌)లు దంచికొట్ట‌డంతో భార‌త్ 6.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. కోచ్‌గా గౌత‌మ్ గంభీర్(Gautam Gambhir), కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి సిరీస్‌లోనే భార‌త్ కైవ‌సం చేయ‌డంతో వారిద్ద‌రు సంతోషంలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రెండో టీ20 మ్యాచ్‌లో భార‌త విజ‌యానంత‌రం కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో కోచ్ గౌతమ్ గంభీర్ మైదానంలో మాట్లాడాడు. వీరిద్ద‌రు చాలా సేపు ఏదో విష‌యం గురించి సిరీయ‌స్‌గా చ‌ర్చించిన‌ట్లుగా తెలుస్తోంది. మ్యాచ్‌లో ఛేజింగ్ గురించే వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఎలా ఆడ‌తామ‌నేది ముందే చెప్పాం..

టీ20 క్రికెట్‌లో దూకుడుగానే ఆడ‌తామ‌ని సూర్య‌కుమార్ యాద‌వ్ తెలిపాడు. మ్యాచ్ అనంత‌రం మీడియాతో సూర్య మాట్లాడుతూ.. ఈ సిరీస్‌కు ముందే తాము ఎలా ఆడ‌తామ‌నే విష‌యాన్ని చెప్పామ‌న్నాడు. ఇక పై కూడా ఇలాంటి క్రికెట్‌నే ఆడ‌తామ‌ని తెలిపాడు. వాతావ‌ర‌ణం ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక జ‌ట్టును 160 ప‌రుగుల క‌న్నా త‌క్కువ‌కే ప‌రిమితం చేయాల‌ని భావించిన‌ట్లుగా వెల్ల‌డించాడు.

అందుకు త‌గ్గ‌ట్టుగానే బౌల‌ర్లు రాణించార‌ని ప్ర‌శంసించాడు. ఇక వ‌ర్షం ప‌డ‌డం కూడా త‌మ‌కు క‌లిసివ‌చ్చింద‌న్నాడు. బ్యాట‌ర్లు కూడా అద్భుతంగా ఆడార‌ని కొనియాడారు. ఇప్ప‌టికే మూడు మ్యాచుల టీ20 సిరీస్ సొంతం కావ‌డంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న నామ‌మాత్ర‌మైన టీ20 మ్యాచులో ఇప్ప‌టి వ‌రకు తుది జ‌ట్టులో ఆడ‌ని ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని సూర్య తెలిపాడు.

Also Read : IND vs SL : శ్రీలంక‌లో అడుగుపెట్టిన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ..

  Last Updated: 29 Jul 2024, 05:11 PM IST