ICC Champions Trophy: శ్రీలంక పర్యటనను క్లీన్ స్వీప్ తో ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ కు రెడీ అవుతోంది. హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌లోనే విజయాన్నందుకున్న గౌతమ్ గంభీర్.. వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా ఈ సిరీస్‌తోనే సన్నాహకాలు మొదలుపెట్టనున్నాడు. టీ20 సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహలు సిద్ధం చేస్తున్నాడు. అయితే వన్డే టీమ్ కూర్పు గంభీర్ కు అసలైన సవాల్ కానుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఆడుతున్న వన్డే సిరీస్ ఇదే. షార్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేసిన రోహిత్ , కోహ్లీ జట్టులోకి వచ్చేశారు. అలాగే గాయాల నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇస్తున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పైనా అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు కూర్పును ఈ సిరీస్ నుంచే పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతీ ప్లేస్ కూ సరిగ్గా సరిపోయే కనీసం ముగ్గురేసి చొప్పున ఆటగాళ్ళను ఎంచుకునే అవకాశముంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు ఎక్కువ వన్డే సిరీస్ లు లేవు. దీంతో ఖచ్చితంగా లంక టూర్ నుంచే జట్టు కూర్పుపై క్లారిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో సీనియర్, యువ ఆటగాళ్ళ రూపంలో ఆప్షన్స్ బాగానే ఉన్నా వారిలో ఎంతమంది అంచనాల మేర రాణిస్తారనేది చూడాలి. ముఖ్యంగా టీ ట్వంటీ టీమ్ నుంచి వన్డే సిరీస్ కు ఎంపికైన కొందరు ఆటగాళ్ళకు గంభీర్ తుది జట్టులో అవకాశాలిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
దీనికి తోడు ఫిట్ నెస్ సమస్యలుంటే మాత్రం ఎట్టపరిస్థితుల్లో చోటు దక్కదని ఇప్పటికే గంభీర్ తేల్చి చెప్పాడు. ఈ విషయంలో సెలక్టర్లకే కాదు టీమ్ లో సీనియర్లు, జూనియర్లని తేడా లేకుండా అందరికీ గట్టి వార్నింగే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే టీ ట్వంటీలకు బాగా అలవాటుపడి వన్డే ఫార్మాట్ లో ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందరూ కాకున్నా కొందరు ప్లేయర్స్ విషయంలో ఇది రుజువైంది కూడా. ఈ కారణంగానే ఫిట్ నెస్ అంతంత మాత్రంగా ఉంటే మాత్రం జట్టులో చోటు ఇచ్చేది లేదని గంభీర్ తెగేసి చెప్పినట్టు సమాచారం. కొందరు టీ ట్వంటీలకు తగ్గట్టే ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నారని, వన్డేలపై అంత ఫోకస్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ గంభీర్ కఠినంగా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే శ్రీలంకలో మూడు వన్డేల సిరీస్ మొత్తానికి కొలంబో ఆతిథ్యమిస్తుండగా.. తొలి మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
Also Read: ICC T20I rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్