ODI World Cup Squad: వరల్డ్ కప్ జట్టులో అతనుండాల్సిందే.. సెలక్టర్లకు దాదా కీలక సూచన..!

2011లో సొంతగడ్డపైనే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా (ODI World Cup Squad) మరోసారి దానిని రిపీట్ చేస్తుందని ఎదురుచూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Sourav Ganguly

Saurav Ganguly

ODI World Cup Squad: టీమిండియా ప్రపంచకప్ గెలిచి 12 ఏళ్ళు దాటిపోయింది. అటు వన్డే ఫార్మాట్ లోనూ, ఇటు టీ ట్వంటీ ఫార్మాట్ లోనూ 2011 తర్వాత అందని ద్రాక్షగానే మారింది. ద్వైపాక్షిక సిరీస్ లలోనూ, విదేశీ గడ్డపై నిలకడగా రాణిస్తున్నా ఐసీసీ మెగా టోర్నీల్లో మాత్రం విజయం అందడం లేదు. దీంతో ఈ సారి సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ పైనే భారత్ అభిమానుల దృష్టంతా ఉంది. 2011లో సొంతగడ్డపైనే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా (ODI World Cup Squad) మరోసారి దానిని రిపీట్ చేస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జట్టుపై సెలక్టర్లకు క్లారిటీ వచ్చేసిందని వార్తలు వస్తున్నా కొందరి ఆటగాళ్ళ గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్ళు బీసీసీఐ సెలక్టర్లకు కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ప్రపంచకప్ కోసం జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టులోకి యశస్వి జైశ్వాల్ ను తీసుకోవాలని దాదా సూచించాడు.

గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ రాణిస్తున్న జైశ్వాల్ ఇటీవలే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. విండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జైశ్వాల్ తొలి టెస్టులోనే సెంచరీ బాదాడు. విండీస్ గడ్డపై సూపర్ ఇన్నింగ్స్ ఆడి 171 పరుగులు చేసిన ఈ యువ ఓపెనర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గానూ ఎంపికయ్యాడు. అరంగేట్రంలోనే జైశ్వాల్ బ్యాటింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా గంగూలీ కూడా అతని బ్యాటింగ్ తీరు ఆకట్టుకుందన్నాడు. ప్రపంచకప్ లో భారత్ టైటిల్ కొట్టాలంటే జైశ్వాల్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ ఉండాల్సిందేనన్నాడు. సొంత పిచ్ లపై అతను మరింత రాణిస్తాడంటూ దాదా వ్యాఖ్యానించాడు.

Also Read: India in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో టీమిండియాదే పైచేయి.. ఇప్పటివరకు 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్..!

అరంగేట్రంలోనే విదేశీ గడ్డపై సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయమన్న దాదా తాను కూడా ఎంట్రీలోనే శతకం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. టెక్నిక్ పరంగానూ జైశ్వాల్ సాలిడ్ గా కనిపిస్తున్నాడని, మెగా టోర్నీలో జట్టుకు అతడు చాలా ఉపయోగపడతాడని చెప్పుకొచ్చాడు. దాదా వ్యాఖ్యలు సమంజసమే అయినా ప్రస్తుతం వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం చాలా పోటీ నెలకొంది. సీనియర్ , యువ క్రికెటర్లతో కలిపి ప్రతీ ప్లేస్ కోసం కనీసం ఇద్దరు లేదా ముగ్గురు రేసులో ఉన్నారు. కీలక ఆటగాళ్ళు గాయాల నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తే జట్టు ఎంపిక మరింత క్లిష్టం కానుంది. అయితే కోచ్ ద్రావిడ్ , కెప్టెన్ రోహిత్ శర్మ గతంలోనే ప్రపంచకప్ జట్టుపై స్పష్టత వచ్చిందంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకిత్తిస్తోంది.

  Last Updated: 19 Jul 2023, 11:15 AM IST