Site icon HashtagU Telugu

Jasprit Bumrah: స్టార్ పేసర్ ఫిట్.. ఐర్లాండ్ తో సిరీస్ ఆడే ఛాన్స్..!

Bumrah On Fire

Bumrah On Fire

Jasprit Bumrah: భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah) రీఎంట్రీకి రెడీ అయ్యాడు. గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో ఏడాది కాలంగా ఆటకు దూరమైన బూమ్రా త్వరలోనే గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం బూమ్రా ఫిట్ అయినట్టు తెలుస్తోంది. ఆసియా కప్ కు ముందు ఐర్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో అతను ఆడే అవకాశాలున్నాయి. భారత జట్టుకు ఇది గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది కాలంగా పలు కీలక సిరీస్ లు, ఐపీఎల్ కు బూమ్రా దూరమయ్యాడు. ఇప్పుడు ఆసియాకప్ , వన్డే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో బూమ్రా అవసరం చాలా ఉంది. అందుకే టీమిండియా మేనేజ్ మెంట్ కూడా అతని రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న బూమ్రా రోజూ 10 ఓవర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో పూర్తి ఫిట్ నెస్ సాధించి ఐర్లాండ్ తో సిరీస్ ఆడతాడని భావిస్తున్నారు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే అతని రీఎంట్రీ పై నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపేనా..? మరిన్ని మ్యాచ్‌లు డిమాండ్ చేస్తున్న పాక్ ..!

గత ఏడాది జూలై నుండి బూమ్రా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. మధ్యలో ఫిట్ నెస్ సాధించి ప్రపంచకప్ కు ముందు ఆడడడం కొంపముంచింది. గాయం తిరగబెట్టడంతో టీ ట్వంటీ వరల్డ్ కప్, ఆసీస్ తో సిరీస్ , ఐపీఎల్ కు దూరమయ్యేలా చేసింది. మధ్యలో హడావుడిగా బూమ్రాను సౌతాఫ్రికా సిరీస్ లో ఆడించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆటగాడు గాయం నుండి కోలుకున్నాడో లేదో తెలియకుండా సెలక్టర్లు ఆడించిందని మాజీలు సైతం మండిపడ్డారు.

ఈ తప్పిదంతో బూమ్రా ప్రపంచకప్ , న్యూజిలాండ్ టూర్ , బంగ్లాదేశ్ టూర్ , సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్ , ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ , ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ తర్వాత ఫిట్ నెస్ సాధించినా ముందు జాగ్రత్త కోసం డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఎటువంటి సమస్యా లేకుండా బౌలింగ్ చేస్తున్న బూమ్రా ఐర్లాండ్ తో సిరీస్ కు ఎంపికై తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆసియాకప్ , వన్డే ప్రపంచకప్ లలో బూమ్రా ఆడడం ఖాయమని చెప్పొచ్చు.