Site icon HashtagU Telugu

Shivam Mavi: అరంగేట్రం అదిరింది.. ఆరేళ్లుగా ఎదురుచూసిన యువ పేసర్!

Shivam

Shivam

టీమిండియాలోకి (Team india) గత కొంత కాలంగా యువ పేసర్లు చాలా మంది వస్తున్నారు. అండర్ 19 ప్రపంచకప్‌లో మెరిసి.. ఐపీఎల్‌లో అదరగొట్టి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. ఇదే కోవలోకి వస్తాడు ఉత్తర్ ప్రదేశ్‌ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి (Shivam Mavi). 2018 అండర్ 19 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు మావి. టోర్నీలో అద్భుతమైన ఎకానమీతో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్‌ ప్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శివమ్ మావిని 3 కోట్లకు వేలంలో దక్కించుకుంది. దానికి తగ్గట్టుగానే లీగ్‌లో సత్తా చాటాడు ఈ యువ పేసర్. 32 మ్యాచ్‌లలో 30 వికెట్లు పడగొట్టాడు. తర్వాత కోల్‌కతా రిలీజ్ చేయడంతో మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్‌ 6 కోట్లకు శివమ్ మావిని కొనుగోలు చేసింది. ఐపీఎల్ మాత్రమే కాదు దేశవాళీ టోర్నీ విజయ్ హజారేలోనూ మావి ఆకట్టుకున్నాడు. 7 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టడం ద్వారా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

ఇప్పుడు వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం జట్టు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఉన్న బీసీసీఐ శ్రీలంకతో సిరీస్‌కు యువ ఆటగాళ్ళకే ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలో శివమ్ మావి (Shivam Mavi) తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమ్ మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తన పేస్‌తో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టడమే కాదు 4 కీలక వికెట్లతో ఆ జట్టు బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.

అండర్ 19 ప్రపంచకప్‌ ఆడినప్పటి నుంచీ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నానని, ఇన్నాళ్ళకు తన కల నెరవేరిందన్నాడు (Shivam Mavi) శివమ్ మావి. అన్నింటికీ మించి తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. అండర్ 19 తర్వాత గాయాల పాలవడం, మళ్ళీ ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆరేళ్ళ నుంచీ ఎదురుచూస్తున్నప్పుడు అసలు టీమిండియాకు ఎంపికవుతానా లేదా అన్న ఆందోళన కలిగిందన్నాడు. అయితే ఐపీఎల్‌ ఆడడం ద్వారా కాస్త టెన్షన్ తగ్గిందన్నాడు. లంకపై మొదటి వికెట్‌ తన ఫేవరెట్‌గా చెప్పాడు. శ్రీలంకతో తొలి టీ ట్వంటీలో తన ప్రదర్శన ద్వారా మావి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన మూడో భారత బౌలర్‌గా (Bowler) రికార్డులకెక్కాడు. ఈ సిరీస్‌ మిగిలిన మ్యాచ్‌లలోనూ తన జోరు కొనసాగించాలని శివమ్ మావి ఉత్సాహంగా ఉన్నాడు.

Also Read: Rishabh Pant: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముంబైకి తరలింపు