Site icon HashtagU Telugu

Pele passes away: ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

pele

Resizeimagesize (1280 X 720) 11zon

బ్రెజిల్‌ దిగ్గజం, ఫుట్‌బాల్‌ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే (Pele) ఇక లేరు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పీలే (Pele) కుమార్తె ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. క్యాన్సర్‌ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్‌ కణితిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తో పాటు పలు అవయవాలు పనిచేయకపోవడంతో పీలే తుది శ్వాస విడిచారు.

ప్రపంచ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో లెజెండ్ గా పేరున్న పీలే తన అద్భుతమైన ఆటతో రెండు దశాబ్దాల పాటు క్రీడా ప్రేమికులను అలరించారు. మైదానంలో అతని విన్యాసాలకు కోట్లాదిమంది మంత్రముగ్దులయ్యారు. బ్రెజిల్ జాతీయ జట్టుతో పాటు క్లబ్ శాంటోస్ జట్ల తరఫున ఆడారు. మొత్తం కెరీర్‌లో 1366 మ్యాచ్‌ల్లో మొత్తం 1281 గోల్స్ చేశారు. ప్రతి మ్యాచ్‌కు ఆయన గోల్ సగటు 0.94 గా ఉంది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమం.. ప్రపంచలోనే మూడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఏకైక ఆటగాడు పీలే మాత్రమే. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పీలే.. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎన్నో ఘనతలు అందుకున్నారు.

Also Read: 16,397 Deaths: 2021లో సీటుబెల్ట్‌ ధరించక 16 వేల మంది మృతి

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఫార్వర్డ్ క్రీడాకారుడిగా పీలేను మించిన వారు లేరనే చెప్పాలి. 16 ఏళ్ల ప్రాయంలోనే బ్రెజిల్‌ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్‌ చేసి జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన వ్యక్తిగా నిలిచారు. క్లబ్‌ శాంటోస్‌ తరఫున బరిలోకి దిగిన పీలే 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ చేశాడు. 1961 నుంచి 1968 వరకూ ఆరుసార్లు తన క్లబ్‌కు బ్రెజిల్‌ లీగ్‌ టైటిల్‌ను అందించాడు. మరో దిగ్గజ ఆటగాడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనాతో కలిపి పీలే ప్లేయర్‌ ఆఫ్‌ ది సెంచరీ అవార్డును అందుకున్నారు. పీలే మృతితో సాకర్ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు స్టార్ ప్లేయర్స్ , అభిమానులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.