Finn Allen: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 65 పరుగుల భారీ తేడాతో కేకేఆర్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైనప్పటికీ ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఫిన్ అలెన్ మొదటి ఓవర్‌లోనే చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ విదేశీ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
మొదటి ఓవర్‌లోనే విధ్వంసం
సన్‌రైజర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తరపున కెప్టెన్ అజింక్య రహానే, ఫిన్ అలెన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇన్నింగ్స్ మొదటి బంతికే రహానే సింగిల్ తీసి అలెన్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న 5 బంతుల్లోనే ఫిన్ అలెన్ 24 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాబట్టి సంచలనం సృష్టించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా ఫిన్ అలెన్ రికార్డుకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ (2018లో మొదటి ఓవర్‌లో 21 పరుగులు) పేరిట ఉండేది.
Also Read: బోణీ కొట్టిన హైదరాబాద్.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!
కేకేఆర్‌కు వరుసగా రెండో ఓటమి
టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన కోల్‌కతాకు ఇప్పుడు సన్‌రైజర్స్ రూపంలో రెండో ఓటమి ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెన్రిక్ క్లాసెన్ 35 బంతుల్లో 52 పరుగులతో విరుచుకుపడ్డాడు. 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ 10 బంతుల కంటే ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
